Jagan And BJP: ఏపీలో పొత్తుల లెక్కలు తేలడం లేదు. టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. బిజెపి నిర్ణయం ఏమిటి అన్నది తెలియడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ఆ రెండు పార్టీలతో కలవకూడదు అన్నది జగన్ లక్ష్యం. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి, జనసేన సైతం అదే అభిప్రాయంతో ఉన్నాయి. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తూనే తమతో సఖ్యత గా ఉండాలని ఆ రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే బిజెపి ఏ విషయం తేల్చడం లేదు. ఏపీ బీజేపీ నేతల్లో ఒక వర్గం పొత్తును కోరుతోంది.. మరో వర్గం పొత్తును వ్యతిరేకిస్తోంది. ఈ సమయంలో బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమపై ప్రతికూలత వస్తుందని జగన్ భయపడుతున్నారు. అందుకే బిజెపి కోసం కొత్త రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో జగన్ సఖ్యతగా ఉన్నారు. రాజకీయంగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. బిజెపిని నేరుగా స్నేహితుడిగా ఒప్పుకోవడం లేదు. అదే జరిగితే తనకు బలమైన మద్దతుదారులైన మైనారిటీ ఓట్లను దూరం చేసుకుంటాను అన్న ఆందోళన జగన్ ను వెంటాడుతుంది. అదే సమయంలో జగన్ ను బిజెపి సైతం నమ్మడం లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారోనన్న అనుమానం వారిలో ఉంది. జగన్ కు తమ అవసరం ఉంది కాబట్టి ఆయన తమతో ఉన్నాడని.. ఒకవేళ తేడా కొడితే ఎదురు తిరుగుతారని బిజెపి అంచనా వేస్తోంది. అయితే మారిన బిజెపి స్ట్రాటజీని చూసి జగన్ భయపడుతున్నారు. ఆ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. టిడిపి, జనసేన కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకు నియంత్రిస్తున్నారు. ఇందుకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికోసం చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది.
నిన్నటి వరకు బిజెపి తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరుకోవడం వాస్తవం. బిజెపిని కూటమిలోకి తెస్తానని పవన్ చెప్పడం కూడా నిజం. అయితే బిజెపి కూటమిలోకి వచ్చే కంటే.. తమతో సామరస్యంగా ఉండాలని ఆ ఇద్దరు నేతలు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బిజెపికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నారు. అంతవరకు బిజెపి న్యూట్రల్ గా ఉండాలని కోరుతున్నారు. ఎన్నికల నిర్వహణలో వైసీపీకి సహకారం అందించకూడదని మెలిక పెడుతున్నారు. అయితే బిజెపి ఎటువైపు మొగ్గు చూపుతోందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే బిజెపితో కలిసేందుకు ఏ పార్టీ కూడా మొగ్గు చూపకపోవడం కాషాయ దళంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
ఒకవేళ జగన్ ఆఫర్ ను బిజెపి ఒప్పుకుంటే మాత్రం.. టిడిపి, జనసేన నెత్తిన పాలు పోసినట్టే. బిజెపి, వైసిపి ఒక్కటేనని ఏపీ ప్రజలను నమ్మించవచ్చు. విభజన హామీల పాపాన్ని ఆ రెండు పార్టీలపై నెట్టవచ్చు. అదే జరిగితే మైనారిటీలు, బిజెపి వ్యతిరేకవర్గాలు వైసీపీకి దూరమవుతాయి. అప్పుడు పరిస్థితి ఉభయతారకంగా ఉంటుంది. అయితే ఇప్పటికే రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న బిజెపి.. వైసీపీ ఇచ్చే ఆఫర్ కు మొగ్గు చూపుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం.. బిజెపి జగన్ విషయంలో కఠినంగా ఉన్నట్టే. ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చి.. బిజెపికి దగ్గరగా ఉండే పారిశ్రామిక దిగ్గజాలకు రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపినట్టే! మరి ఏం జరుగుతుందో చూడాలి.