Jagan vs Pawan : పిఠాపురంలో గెలుపును వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పవన్ ను ఓడించాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే పిఠాపురంలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నారని జనసేన ఆరోపిస్తోంది. దీనిపైన ముందుగానే అలెర్ట్ అయ్యింది. అటు జనసైనికులు సైతం గట్టిగానే ఉండడంతో వైసిపి సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగిస్తోంది. చివరి రోజు పిఠాపురం నియోజకవర్గాన్ని జగన్ ఎంచుకున్నారు. దాదాపు రోజంతా అక్కడే గడిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సరికొత్త సంకేతాలు పంపారు. వైసిపి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలతో పాటు వంగా గీతకు ఇచ్చే పదవి పై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే విపక్షాలకు చెందిన కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జగన్ ఒకే తరహా ప్రకటనలు చేయడం విశేషం.
చాలా రోజుల నుంచి వై నాట్ కుప్పం అని సంకేతాలు పంపించారు జగన్. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసిపి ఏకపక్ష విజయం దక్కించుకుందో.. నాటి నుంచే చంద్రబాబును ఓడించాలనిలక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. అక్కడ బీసీ వర్గానికి చెందిన భరత్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అటు కుప్పం నియోజకవర్గానికి నిధుల వరద పారించారు. మరోవైపు రాజకీయ ప్రకటన కూడా చేశారు. భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా కూడా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
అయితే తాజాగా పిఠాపురంలో పర్యటించిన పవన్ అదే తరహా ప్రకటన చేయడం విశేషం. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తారని ప్రకటించారు. ఈ ప్రకటన గేమ్ చేంజర్ అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గత ఐదు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగిన వారి పరిస్థితి ప్రజలకు తెలుసు. మరోవైపు కీలక నేతలపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు ఇదే వరాన్ని ప్రకటిస్తున్నారు జగన్. అయితే పిఠాపురం విషయంలో మాత్రం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు జగన్. వైసీపీ అభ్యర్థి వంగా గీత అయితే ఏకంగా కొంగు చాచి మరి పిఠాపురం ప్రజలను ఓటు వేయాలని కోరడం విశేషం. అయితే జగన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పిఠాపురం ప్రజలు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారని.. పవన్ కు ఏకపక్ష విజయం ఖాయమని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.