YS Jagan : వైసిపి సోషల్ మీడియాకు జగన్ భారీ ఆఫర్!

పోయిన చోటే వెతుక్కుంటున్నారు జగన్. భారీ ఓటమి ఎదురైనా.. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ తరుణంలో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగా వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 18, 2024 11:15 am

YS Jagan

Follow us on

YS Jagan :  సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. రాజకీయ పార్టీలు సైతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాను బలంగా నమ్ముతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా వింగును పెంచి పోషిస్తుంది. పార్టీ అనుబంధ సంఘాల కంటే సోషల్ మీడియాతోనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నాయి. ఏపీలో సైతం దాదాపు అన్ని పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లగలిగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ మంచి పనితీరు కనబరిచింది. 67 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019 ఎన్నికల్లో అయితే ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈ రెండు సార్లు వైసిపి సోషల్ మీడియా పోషించిన పాత్ర మరువరానిదని చెప్పవచ్చు. ఐ ప్యాక్ టీం తో సమానంగా సోషల్ మీడియా వింగ్ పనిచేసింది. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి. వైసీపీ సోషల్ మీడియాను విజయసాయిరెడ్డి హ్యాండిల్ చేసేవారు. ఎప్పటికప్పుడు కొత్త నియామకాలు చేపట్టి.. పార్టీకి అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఇది బాగా వర్కౌట్ కావడంతో వైసిపి సక్సెస్ అయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. దీంతో సోషల్ మీడియా తీరుపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా విభాగాన్ని చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిని జగన్ తప్పించారు. కొత్త నేతకు ఆ బాధ్యతలు అప్పగించారు.

* వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశాలు
తాజాగా జగన్ పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విభాగం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సోషల్ మీడియాలో పనితీరు మెరుగుపరుచుకోవాలని.. ప్రతి ఒక్కరి సేవలకు గుర్తింపు ఉంటుందని.. అందుకు తగ్గ ప్రయోజనాలు కల్పిస్తామని.. పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక గుర్తింపు కూడా ఇస్తామని జగన్ చెబుతున్నారు. దీనిని బట్టి సోషల్ మీడియాకు జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులను, యాక్టివ్ గా ఉన్న వారిని సోషల్ మీడియా విభాగంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయంపై అన్ని నియోజకవర్గాల బాధ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

* ఆ ఆలోచనలో జగన్
జమిలిలో భాగంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పార్టీ బాధ్యులను మార్చుతూనే.. ఇంకో వైపు సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అంచనాకు వస్తున్నారు.ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను సోషల్ మీడియాపై పెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ కూడా ఆ పార్టీ సోషల్ మీడియాను ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వారి ఫార్ములానే జగన్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా టిడిపి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతారో చూడాలి.