AP Rains : ఏపీకి బంగాళాఖాతం నుంచి మరో హెచ్చరిక వచ్చింది. మరో అల్పపీడనం ఏర్పడుతుండడమే ఇందుకు కారణం. బంగాళాఖాతం మధ్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఈనెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 22వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం నెలకొందని పేర్కొంది. 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారవచ్చు అని స్పష్టం చేసింది. అయితే ఇది తుఫాన్ గా మారుతుందా?లేదా?అనేది ఇప్పుడే అంచనా వేయలేమని భారత వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.దీని ప్రభావం ఒడిస్సా పై అధికంగా ఉంటుందనిఅంచనా వేస్తున్నారు. ఒడిస్సా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెబుతున్నారు. బలమైన ఈదురుగాలులతో పాటు పిడుగులు సైతం పడతాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం పై కూడా విపరీతమైన ప్రభావితం ఉంటుందని..ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం పై ప్రభావం అధికమనివాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిస్సా లోని మయూర్ బంజ్, కియాంఝర్, బాలాసోర్, భద్రక్, జైపూర్, కేంద్ర పారా, కటక్, జగత్ సింగ్ పూర్, ఖుర్దా, పూరి, గంజాం, గజపతి, రాయగడ, కలహండి, కోరాపుట్, మల్కాన్ గిరి, నవరంగ్ పూర్ జిల్లాల్లో ఈనెల 20 నుంచి మాస్టరు వర్షాలు కురుస్తాయని.. క్రమేపి వర్షాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
* తప్పిన ప్రమాదం
ఇప్పటికే ఏపీకి ఒక ప్రమాదం తప్పింది. వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురిసాయి. అటు తమిళనాడు, కర్ణాటకలో సైతం వర్షాలు పడ్డాయి. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలో అతి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో చెన్నై తో సహా తిరువల్లూరు, కాంచీపురం, చంగల్పట్టు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం సైతం స్తంభించింది. బెంగళూరులో సైతం వర్షాలు దంచి కొడుతున్నాయి.
* భారీ వరదలతో అతలాకుతలం
ఆగస్టు నెలలో భారీ వర్షాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. భారీ వరదలకు విజయవాడ నగరం మునిగిపోయింది. మరోసారి అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎఫెక్ట్ అధికమని వర్ష సూచన ఉందని.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.