Jagan Private Security: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారా? ప్రైవేటు టీం తో సెక్యూరిటీ నియామకం జరిగిందా? ఓ 40 మంది టీం ఇకనుంచి భద్రత కల్పించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సరైన భద్రత కల్పించడం లేదు. దీనిపై జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు కూడా. అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్మీలో రిటైర్ అయిన వారితో కూడిన బృందాన్ని భద్రత కోసం వినియోగించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ 40 మందిని ఎంపిక చేస్తారని.. ఈనెల 6న కర్నూలు జిల్లా డోన్ టూర్ లో వారు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!
* అప్పట్లో వేలాదిమంది..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జగన్ భద్రత కోసం వేలాది మంది పోలీసులను వినియోగించుకునే వారన్న విమర్శ ఉంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు భారీగా మోహరించేవారు. అప్పట్లో పోలీస్ సేవలను దుర్వినియోగం చేశారన్న విమర్శలను జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నారు. అయితే ఏపీలో అధికారం కోల్పోయేసరికి జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గించింది ఏపీ ప్రభుత్వం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో.. ఓ సామాన్య ఎమ్మెల్యే గానే ఆయనకు రక్షణ ఉంది. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా సరైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు. అయితే ఈ భద్రత తనకు ఎంత మాత్రం చాలడం లేదని.. పైగా జిల్లాల పర్యటనలో అపశృతుల చోటు చేసుకున్న దృష్ట్యా భద్రత పెంచాలని జగన్మోహన్ రెడ్డి కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటికే దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు. అయితే నిబంధనల మేరకు తాము భద్రత కల్పిస్తున్నామని.. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
* ఈనెల 6 నుంచి విధుల్లోకి..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన సమయంలో అపశృతులు దొర్లుతున్నాయి. పార్టీ శ్రేణులు కాన్వాయ్ పై( convoy ) దూసుకు వస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకే ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకున్న మెడికల్లాంటి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓ 40 మందితో కూడిన బృందాన్ని జగన్మోహన్ రెడ్డి భద్రతకు నియమించారు. జగన్ జిల్లాల పర్యటన చేసిన సమయంలో రోప్ వేతోపాటు ఇతరత్రా భద్రత కల్పించనుంది ఈ బృందం. ఈనెల 6న డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు వివాహం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు జగన్మోహన్ రెడ్డి. నాటి నుంచే ఈ ప్రైవేటు సైన్యం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించనుంది. త్వరలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి భద్రతపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.