AP development : ఏ రాజకీయ పార్టీ( political party) కైనా.. ఏ నేతకు అయినా.. ప్రజలకు మేలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. వారి పాత్ర కూడా అదే. అయితే వెళ్తున్న దారులు మాత్రం వేరుగా ఉంటాయి. ఒక్కో పార్టీ సిద్ధాంతం ఒక్కోలా ఉంటుంది. కొందరు అభివృద్ధి చేయడం ద్వారా వాటి ఫలాలు ప్రజలు అనుభవించాలని భావిస్తారు. నేరుగా డబ్బులు పంచి వారి ఆర్థిక అభివృద్ధి పెంచాలని మరొకరు చూస్తారు. ఇందులో మొదటి వ్యక్తి చంద్రబాబు. రెండో వ్యక్తి కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్ అభివృద్ధి కంటే సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో సంక్షేమం అంటేనే చంద్రబాబు వ్యతిరేకి అనే ముద్ర ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో మీ ఇద్దరి నేతల తీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. సంక్షేమం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. రెట్టింపు సంక్షేమం అందిస్తానన్న చంద్రబాబు మాటను నమ్మారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేయాల్సి వస్తోంది. అభివృద్ధికి బ్రాండ్ గా ఉన్న ఆయన ఇప్పుడు సంక్షేమ బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక వైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు చంద్రబాబు. ఇది కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందుల్లో పెట్టే విషయమే. ప్రజలు దీనిని గుర్తిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి ఇబ్బందికరమే.
* నవ్యాంధ్రప్రదేశ్ తొలినాళ్లలో..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu) ఎన్నికయ్యారు. ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగారు. అమరావతి రాజధానిని పట్టాలెక్కించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల కు పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. కానీ 2019లో ప్రజలు అధికార మార్పిడి చేశారు. ఐదేళ్లలో అభివృద్ధి పూర్తిగా మరుగున పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అయితే దానిని సహించుకోలేకపోయారు ఏపీ ప్రజలు. అందుకే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనలోనే అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. దీనిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది.
* ఏడాదిలోనే 50 కిలోమీటర్ల రైల్వే లైన్
చంద్రబాబు మార్కు పాలనను చిన్న ఉదాహరణగా తీసుకుంటే.. తన ఏడాది పాలనలోనే శ్రీకాళహస్తి- ప్రకాశం( Srikalahasti- Prakasam ) జిల్లాలోని నడికుడి మధ్య రైల్వే లైన్ ను కేస్ స్టడీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక రైల్వే లైన్ కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ భూసేకరణ సమస్యతో పాటు అనేక రాజకీయ కారణాలు, సమస్యల వల్ల ఈ పనులు పూర్తికాలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైల్వే శాఖ పరంగా ఉన్న అవరోధాలను ఒక్కొక్కటి పరిష్కరించగలిగారు. దీంతో ఈ రైల్వే లైన్ పరిధిలోని.. ఏడాదిలోనే కనిగిరి పామూరు మండలాల మధ్య సుమారు 50 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రైలు ఇంజన్ తో ట్రయల్ రన్ కూడా పూర్తయింది. త్వరలోనే మిగతా ప్రాంతాల్లో పనులు పూర్తిచేసి శ్రీకాళహస్తి- ప్రకాశం మధ్య రైళ్లు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు.
* కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన..
అయితే ఏపీలో కూటమి సాధించిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తిస్తున్నారో లేదో కానీ.. జాతీయస్థాయిలో మాత్రం ఇది చర్చకు దారితీస్తోంది. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ప్రజలు సంతోషించే ఎన్నో విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్లతో జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం నాటికి మరో లక్ష కోట్ల విలువ గల రోడ్ల నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో ఏపీలో రోడ్లు అమెరికా రోడ్లను తలపిస్తాయని గడ్కరి చెప్పారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. అయితే ఏపీలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదని చెబుతోంది. కానీ విద్యాధికులు, విద్యావేత్తలు, తట్టస్తులు మాత్రం దీనిని గుర్తిస్తున్నట్లు అర్థమవుతోంది.