YS Jagan : తిరుమలలో వివాదం యావత్ దేశాన్ని ఊపేస్తోంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ వ్యవహారం నడుస్తోంది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో.. జంతు కొవ్వు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ గట్టిగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. ఈ ముప్పేట దాడితో వైసిపి ఆత్మ రక్షణలో పడింది. ఆ పార్టీకి చెందిన నేతలు కౌంటర్ ఇస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఈ తరుణంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎటువంటి ప్రకటనలు చేస్తారు? ఆయన చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. రేపు జగన్ తిరుమల వెళుతున్న దృష్ట్యా వైసీపీ శ్రేణులు భారీగా చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతోంది. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ హై కమాండ్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చింది.
*కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు ఎందుకు ఇవ్వలేదు
అయితే గతంలో తిరుమల వెళ్లే క్రమంలో సీఎం హోదాలో జగన్ వ్యవహరించిన తీరును కూటమి పార్టీల నేతలు ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో జరిగే కీలక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యత సీఎం దంపతులది. గతంలో ఎన్నికైన సీఎంలంతా కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ జగన్ ఒక్కసారి కూడా ఆయన భార్య భారతి తో కలిసి వెళ్ళలేదు. ఇద్దరూ కలిసి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. ఇప్పుడు దీనినే ప్రస్తావిస్తున్నారు కూటమి నేతలు. ఒక్కసారైనా సీఎం హోదాలో భార్యతో కలిసి వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.
* తెరపైకి డిక్లరేషన్
మరోవైపు జగన్ డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. తిరుపతి వెళ్లే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. కానీ జగన్ ముఖ్యమంత్రిగా చాలాసార్లు తిరుమల వెళ్లారు. కానీ డిక్లరేషన్ ఇవ్వలేదు. టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, జీవోలు ఎప్పుడూ ధృవీకరించలేదు. ఇప్పుడు దీనిని హైలెట్ చేస్తున్నారు కూటమి పార్టీల నేతలు. గతంలో సైతం జగన్ పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వడం అవసరం లేదని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ఒక సామాన్య ఎమ్మెల్యే మాత్రమే. మాజీ సీఎం మాత్రమే. ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కూడా కాదు. అటువంటి వ్యక్తి తప్పకుండా ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
* వైసీపీలో ఆందోళన
తిరుపతి లడ్డు వ్యవహారంలో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. దానిని ఎలాగైనా అధిగమించాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అందులోభాగంగానే జగన్ తిరుమలను సందర్శించనున్నారు. ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు? అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా పార్టీ శ్రేణులుఈ పిలుపునకు స్పందిస్తాయా లేదా అన్నది చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More