Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి వైసిపి ఖాళీ అవుతుందా? ఆ పార్టీని వీడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారా?తెర వెనుక ఏదో జరుగుతోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టిడిపి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.రేపు జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళనున్నారు.దాదాపు 20 రోజులు పాటు అక్కడే ఉంటారు. కూతురి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే సిబిఐ అనుమతి తీసుకున్నారు జగన్. ఈరోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కావడంతో ఇడుపాలపాయలో నివాళులు అర్పించారు. రేపు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళనున్నారు. గత మూడు రోజులుగా పులివెందుల నియోజకవర్గంలోనే జగన్ గడిపారు. తిరిగి ఈనెల 25న రాష్ట్రానికి రానున్నారు. అయితే ఆయన వచ్చే సమయానికి వైసీపీని అడ్డగోలుగా చీల్చుతారని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లే సమయంలో ఆ పార్టీని అడ్డగోలుగా చీల్చడం చూశాం. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం చూశాం. అయితే ఇప్పుడు వైసీపీ బలాన్ని, బలగాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అది ఎంతవరకు సాధ్యమా అన్నది తెలియాల్సి ఉంది.
* ఇద్దరు ఎంపీలు జంప్
ఇప్పటికే వైసీపీ నుంచి జంపింగ్ లు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మరో ఎంపీ చేరెందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో ఏడుగురు మాత్రం తాము జగన్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. వారిలో ఒకరిద్దరు తప్ప అంత వైసీపీకి వీర విధేయులు కావడం గమనార్హం. అయితే పరిస్థితులకు తగ్గట్టు చాలామంది నేతలు మారుతారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలామందికి వ్యాపారాలు, వ్యాపార సంస్థలు ఉండడంతో.. వారు వైసీపీలో ఫిక్స్ గా ఉంటారా? లేదా? అన్నది అనుమానమే.
* ముగ్గురు ఎమ్మెల్సీలు దూరం
మరోవైపు శాసనమండలిలో సైతం సభ్యులు కూటమి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లలో కూటమి గెలిచింది. కానీ శాసనమండలి విషయానికి వచ్చేసరికి కూటమి బలం అంతంత మాత్రమే. వైసీపీకి ఇక్కడ 38 మంది సభ్యుల బలం ఉంది. అందుకే టిడిపి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సుంకర పద్మశ్రీ, పోతుల సునీత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా ప్రకటించారు. నేరుగా మండలి చైర్మన్ కు రాజీనామాను సమర్పించారు. ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు వారి బాటలో ఉన్నట్లు సమాచారం.
అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నారు. వీరు పదవులతో టిడిపి కూటమి పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఆ రెండు చోట్ల కూటమి పార్టీల ప్రాతినిధ్యం పెరగడమే ముఖ్య ఉద్దేశం. వీరు రాజీనామా చేస్తే కనీసం పోటీ పెట్టే స్థితిలో వైసీపీ లేదు. ఆ కారణం చేతనే వారితో రాజీనామాలు చేయిస్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యుల రాజీనామా ఆమోదం ఇట్టే లభించే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం అంత ఈజీ కాదు. ఇప్పటికీ మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. ఆయన ఆమోదిస్తే కానీ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు కుదిరే పని కాదని తెలుస్తోంది.
* ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదిస్తారా
గతంలో ఉమ్మడి ఏపీ సమయంలో శాసనసభ స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ ఉండేవారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ వందమంది ఎమ్మెల్యేల వరకు రాజీనామా అప్పట్లో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడితో నాడు స్పీకర్ గా ఉన్న మనోహర్ ఆమోదించలేదు. దీంతో వారి రాజీనామా చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు కూడా వైసీపీకి చెందిన మండలి చైర్మన్ ఉండడంతో ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే జగన్ విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి ఏమీ కాదని
.. కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు చేజారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More