Politics-lookback-2024 : జగన్ తలరాతను మార్చేసింది 2024. రాజకీయాల్లో తిరుగులేని శక్తి అనిపించుకున్న జగన్ ఈ ఏడాదిలోనే నిలువునా కూలిపోయారు. నాలుగు పదుల వయస్సు ఉన్న జగన్.. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును మట్టి కరిపించారు. దేశంలో ఎక్కడా వినని, చూడని విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎదురులేని తీరులో నడిపిస్తున్న యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఎదిరించిన ఘనత సొంతం చేసుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్రాన్ని ఢీ కొట్టి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి.. అటు కేంద్ర పెద్దలతో, ఇటు తన తండ్రి సమకాలీకుడుతో ఏకకాలంలో పోరాడిన యోధుడు జగన్. అటువంటి జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేసింది 2024. ఎదురులేని జగన్ జైత్రయాత్రను బ్రేక్ చేసింది ఈ ఏడాది. అందుకే జగన్ జీవితంలో గుర్తుండిపోతుంది 2024.
* చేదు ఫలితాలే
ప్రతి పార్టీకి గెలుపోటములు అనేవి సర్వసాధారణం. కానీ ఇవి వైసిపి విషయానికి వచ్చేసరికి మాత్రం.. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు దక్కించుకుంది. కానీ 2024 లో మాత్రం చేదు ఫలితాలను చవిచూసింది. ఎంతలా అంటే పార్టీ కూడా ఉనికి చాటుకోవడానికి కష్టమయ్యే రీతిలో పరిస్థితి దాపురించింది. మహావృక్షమైన కాంగ్రెస్ పార్టీని ఎదిరించారు జగన్. నాయకత్వాన్ని విభేదించి జైలు పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితో పాటు బయటకు వచ్చారు. తనతో కలిసి వచ్చిన వారితో రాజీనామా చేయించి 2012లో ఉప ఎన్నికకు వెళ్లారు జగన్. 18 స్థానాలకు పోటీ చేసి 15 స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగు దేశాన్ని నామరూపాలు లేకుండా చేశారు. 2014లో అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లారు. 67 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2019లో తన జైత్రయాత్రను కొనసాగించారు. 151 సీట్లతో అధికారాన్ని అందుకున్నారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి తన జైత్రయాత్రలో తన బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగారు జగన్. రాజ్యసభ చరిత్రలో తెలుగు పార్టీకి 11 మంది సభ్యులు ఉండడం రికార్డ్. 58 మంది సభ్యులు ఉండే శాసనమండలిలో వైసిపి బలం అక్షరాల 38. ఢిల్లీ నుంచి గల్లి వరకు అంతా వైసీపీ ప్రాతినిధ్యమే.
* ఒక్కసారిగా తగ్గిన గ్రాఫ్
అంతటి వైసిపి బలాన్ని కనుమరుగు చేసింది 2024. వైసిపి ఆవిర్భావం నుంచి గ్రాఫ్ పెరుగుతూ వస్తుండగా.. ఈ ఏడాదిలో మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది. దాదాపు పార్టీ ఉనికి చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. వై నాట్ 175 అన్న నినాదం వినిపించిన వైసిపి చతికిలపడింది. జగన్ అంటే గన్ తో పోల్చేవారే.. పేలని గన్ అంటూ ఎద్దేవా చేయడం విశేషం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. ఒకనాడు అసెంబ్లీలో పులిలా విరుచుకుపడిన జగన్ యేనా అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యవహార శైలి మారిపోయింది. చివరకు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తడబాటు పడిన జగన్ను చూసి సగటు వైసీపీ అభిమాని ఎంతో బాధపడిపోయారు. వైసీపీకి అక్షరాల 2024 చేదు గుళికలను మిగిల్చింది. పార్టీలో నిశ్శబ్ద వాతావరణానికి ఈ ఏడాది కారణమైంది. వచ్చే ఏడాదిలోనైనా కొంగొత్త ఆశలతో వైసిపి పూర్వవైభవం దిశగా విస్తరిస్తుందో.. లేకుంటే అచేతనం అవుతుందో చూడాలి.