Jagan: సాధారణంగా ఏ పార్టీ ఓడిపోయినా..ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెప్పడం సర్వసాధారణం. ప్రతి పార్టీకి ఇది ఎదురయ్యే దే. అయితే కొందరు కేసుల భయంతో వెళ్తారు.. మరికొందరు పదవులను వెతుక్కుని వెళతారు.. మరి కొందరు పవర్ ను ఆశించి వెళ్తారు.ఇలా వెళ్లే క్రమంలో పార్టీతో పాటు అధినేతను దూషిస్తుంటారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కంటే జగన్ పైనే సొంత పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలామంది నేతలు టిడిపిని వీడారు. కరణం బలరాం, సిద్దా రాఘవరావు వంటి సీనియర్ నేతలు వైసీపీలోకి వెళ్లిపోయారు. కానీ ఏనాడు చంద్రబాబును విమర్శించలేదు. స్థాయికి మించి మాట్లాడలేదు. అయితే వల్లభనేని వంశీ లాంటి నేత మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆయనను తప్పించి వైసీపీలోకి వెళ్లిన టిడిపి నేతలు ఎవరు దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం నిస్సహాయత వ్యక్తం చేస్తూ పార్టీ మారారే తప్ప.. పార్టీ అధినేత తీరుతో విభేదించి వెళ్లలేదు. అయితే ఈ విషయంలో వైసీపీ నేతల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. పదవులు అనుభవించారు. పార్టీ అధికారానికి దూరమయ్యేసరికి అధినేత తీరుపై విరుచుకుపడుతూ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా ఏ పార్టీలో చేరకముందే విమర్శలు చేసిన వారు ఉన్నారు.
* ఆమెకు అరుదైన అవకాశం
వాసిరెడ్డి పద్మకు జగన్ చాలా ఛాన్స్ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పద్మ. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. అయితే ఎవరికి ఆర్ధికంగా ఇవ్వని విధంగా పద్మకు చేయూతనందించారు జగన్. అధికారంలోకి రాగానే క్యాబినెట్ హోదా తో సమానమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంతటితో ఆగనని కూడా హెచ్చరిస్తున్నారు. జగన్ ను ఇరుకున పెడతానని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ వైఫల్యాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే ఇది జగన్ స్వయంకృతాపరాధమని వైసిపి నేతలు చెబుతున్నారు. వాసిరెడ్డి పద్మకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఆమె ఈనాడు ఎదురు తిరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
* తప్పుపడుతున్న బాలినేని
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ కు సమీప బంధువు. అయినా సరే జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చివరకు విద్యుత్ ఒప్పందాలపై కూడా మాట్లాడుతున్నారు. వైసిపి హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన నేతల్లో బాలినేని ఒకరు. జగన్ ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. అయినా సరే ఆయన జగన్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. జగన్ పాలనా వైఫల్యాలను బయట పెడుతూనే ఉన్నారు. అప్పట్లో ఇతర వైసీపీ నేతలు పట్టించుకోకుండా బాలినేని వంటి నేతలకు జగన్ ప్రాధాన్యం ఇవ్వడం తప్పు అని ఇప్పుడు తెలుస్తోంది.
* ధర్మానది మరో తీరు
మరోవైపు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు వైసిపి హయాంలో ఎంతో లాభపడ్డారు. చాలా అంశాల్లో జగన్ ను విభేదించిన ధర్మానకు పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి అదే ధర్మాన జగన్ తో ఆడుకుంటున్నారు. మితిమీరిన గౌరవం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి అని వైసిపి నేతలే జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. అటు పార్టీని విడిచి పెడుతున్న వారిది అదే మాట.. పార్టీలో ఉంటూ సైలెంట్ అయిన నాయకులది అదే మాట. ఈ విషయంలో మాత్రం చంద్రబాబుకు మెచ్చుకోవాల్సిందే. అప్పట్లో టిడిపిని విభేదించిన ఒక్క నాయకుడు కూడా చంద్రబాబుపై మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదు.