NTR: నందమూరి కుటుంబంలో మరో పండుగ. నందమూరి తారక రామారావు సినీ జీవితం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనికి చైర్మన్ గా టిడిపి నేత టిడి జనార్దన్ ఉన్నారు. ఈనెల 14న విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వజ్రోత్సవాలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆహ్వానించారు కమిటీ ప్రతినిధులు. వారితో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారు. ఇదే తరహాలో విశాఖ, తిరుపతి, చెన్నై, కర్ణాటక తో పాటు హైదరాబాదులో నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులో అయితే ఎన్టీఆర్ పేరుతో మ్యూజియం కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ పేరు మార్మోగనుంది.
*తారక్ ని ఆహ్వానిస్తారా?
అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉంటుందా? ఆయనకు పిలిస్తే వస్తారా? లేకుంటే గతం మాదిరిగా ముఖం చాటేస్తారా? అన్న చర్చ అయితే నడుస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను విజయవాడలో నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ను ఆహ్వానించారు. కానీ వారిద్దరు వేరువేరు కారణాలతో గైర్హాజరయ్యారు. చంద్రబాబు, బాలకృష్ణతో ఉన్న విభేదాలతోనే తారక్ కార్యక్రమానికి హాజరు కాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారన్న ప్రచారం నడిచింది. నాడు కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమతో పాటు ఈసారి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉంటుందని కూడా తెలుస్తోంది.
* అన్నింటికీ గైర్హాజరు
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి రాజకీయ వేదికలను పంచుకోవడం లేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు. అటు తర్వాత చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా స్పందించలేదు. కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. నారా లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాగానే స్పందిస్తూ వచ్చారు. అయితే బాలకృష్ణ విషయంలో మాత్రం తారక్ అంతగా స్పందించిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ జీవితం పూర్తయింది.ఆ సందర్భంలో నందమూరి కుటుంబం అంతా కలిసినా.. తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ జాడలేదు. కనీసం నందమూరి తారక రామారావు సినీ జీవిత వజ్రోత్సవ వేడుకల్లోనైనా కనిపిస్తారని.. నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.