YS Jagan : ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. అంతకుముందు అద్భుతమైన విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు. కానీ అంతకుమించి ఓటమితో దేశంలో చర్చకు కూడా కారణమయ్యారు. అయితే అంతులేని మెజారిటీతో గెలుపు.. అంతకుమించి ఓటమి మధ్య కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది. ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో గుర్తించాలి. వైఫల్యాలను అధిగమించి ముందుకెళ్లాలి. ప్రజా ఉద్యమంతో ప్రజలకు చెరువు కావాలి. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలి. పార్టీ శ్రేణులను సమాయత్త పరచాలి. వారిని కార్యోన్ముఖులు చేయాలి. ఇన్ని చేసిన తరువాతనే ఫలితాలు ఆశించాలి. కానీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటుతున్నా.. జగన్ లో పరిమితి మాటలు కనిపించడం లేదు. నేను పలావ్ పెట్టాను. చంద్రబాబు బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీకి నచ్చే వారంతా చంద్రబాబు వెంట వెళ్లారు. ఇప్పుడు పస్తులతో గడుపుతున్నారు.అంటూ జగన్ చేసిన కామెంట్స్ పై ప్రజలు ఆలోచించే స్థితిలో లేరు. ఇంకా ఆ సంక్షేమ పథకాల భ్రమలోనే జగన్ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారని భావించారు. అది తప్పని నిర్ధారణ అయినా.. ఇంకా సంక్షేమ పథకాల బాటలోనే ఉన్నారు. ఇప్పుడు జగన్ ఇచ్చింది చెప్పడం కాదు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తించేలా చేయాలి.అలా చేయాలంటే పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలకు నాయకులు కలిసి రావాలి. కానీ నాయకులు వైసిపిలో యాక్టివ్ గా ఉన్నారా? అధికారం అనుభవించిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఇటువంటి వాటిని ఇప్పుడు జగన్ గుర్తించాలి. ఆ వైఫల్యాలను అధిగమించాలి.
* ఆ మాటలు ఆడక పోతే మంచిది
విలువలు, విశ్వసనీయతల గురించి జగన్ మాట్లాడుతున్నారు. దానికి నమ్మి తాను రాజకీయం చేస్తున్నానని చెప్పుకొస్తున్నారు. బలం లేకపోతే పోటీ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కూటమికి బలం లేకున్నా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దానిని అధర్మ పోరాటంగా అభివర్ణిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నంతవరకు విలువలు విశ్వసనీయతల గురించి చాలా చెప్పొచ్చు. కానీ అధికారం కోల్పోయిన తరువాత.. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్కు అటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
* అప్పట్లో వాటిని సైతం వదల్లేదు
వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలో అధికార పార్టీగా ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడలేదు. సాధారణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దక్కించుకునేవి. వాటిపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టేవి కావు. కానీ శాసనమండలిని చుట్టేయాలని జగన్ భావించారు. ఆ స్థానాల్లో సైతం పోటీ చేసి ఎమ్మెల్సీలను హస్తగతం చేసుకున్నారు. అందుకే విలువలు, విశ్వసనీయతల గురించి జగన్ మాట్లాడుతుండడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.
* ఎట్టకేలకు అంగీకారం
అయితే తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ నేతలతో మాట్లాడారు జగన్. తన వైఫల్యాన్ని స్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తనను అభిమానించిన వర్గాల్లో 10 శాతం మంది చేజారిపోయారన్న విషయాన్ని ప్రస్తావించారు. తన పాలనా వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించారు. తాను నచ్చకో.. లేకుంటే చంద్రబాబు హామీలకు లొంగిపోయో.. 10 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారని.. అందుకే తనకు ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చారు. అంటే పది శాతం మంది అంటే తక్కువ కాదు. కొన్ని లక్షలమంది తనను వ్యతిరేకించారన్న విషయాన్ని తానే ఒప్పుకున్నారు. మొత్తానికైతే జగన్ ఇప్పుడిప్పుడే ఓటమిని అంగీకరిస్తున్నారు. అందుకు కారణాలను ఎటువంటి భేషజాలాలకు పోకుండా చెబుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More