CM Jagan Delhi Tour : ఉదయం వెళ్లి సాయంత్రానికి తాడేపల్లి చేరుకున్న జగన్..అసలేం జరిగింది?

దీని బట్టి ఇది వైసీపీ చేసిన హంగామాగా అర్ధమైపోయింది. అయితే ముందస్తుకు వెళతాను వెళతాను అంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఎందుకు వారిస్తుంది? కానీ జగన్ అండ్ కో మాత్రం చేస్తున్న అతి మాత్రం విమర్శలకు దారితీస్తోంది.

Written By: Dharma, Updated On : July 6, 2023 9:45 am
Follow us on

CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పూర్తయ్యింది. తొలుత రెండు రోజుల పర్యటన అనుకున్నా.. ఒక్కరోజులోనే ఫినిష్ చేసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. గతంలో మాదిరిగా పోలవరం నుంచి ప్రత్యేక హోదా కథతో మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ నుంచి మంత్రుల వరకూ వినతిపత్రాలు అందించమని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగామని చెప్పుకొచ్చారు. ఈ మాటలు వినీవినీ ఏపీ ప్రజలు విసిగిపోయారు. కానీ తెర వెనుక ఏం జరిగి ఉంటుందా అని ఎక్కువ మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగానే సీఎం జగన్ పర్యటన సాగి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

సీఎం ఢిల్లీలో అడుగుపెట్టక ముందే జాతీయ మీడియా నుంచి నీలి మీడియా వరకూ ముందస్తుపై బిగ్ బ్రేకింగ్ న్యూస్ వేసింది. ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సైతం ముందస్తుకు తీసుకెళ్లేందుకు జగన్ పెద్దలను ఒప్పిస్తున్నారని కథనాలను వండి వార్చారు. అయితే దీనిపై వ్యూహాత్మకంగానే జాతీయ మీడియాకు లీకులిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ వద్ద ముందస్తు విషయం ప్రస్తావించారని.. నవంబరులో ఐదు రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు సమాచారం. అటు అమిత్ షాతో సైతం ఇదే ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే పెద్దలు మీ ఇష్టం అన్నరీతిలో సంకేతాలు ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.

టీడీపీ, జనసేనతో బీజేపీ కలవనుందన్న ప్రచారంపై కూడా జగన్ పెద్దల వద్ద ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు సమాచారం. తాను అండగా ఉంటానని.. ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకునేది వైసీపీనేని ప్రధాని మోదీ, షాలకు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు.. తరువాత నమ్మదగిన మిత్రుడిగా ఉంటానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఎన్డీఏలో చేరుతానని కూడా ముందుకొచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కు కొత్త మిత్రులను వెతుకుతున్నవేళ బీజేపీ పెద్దలు ఇష్టపడితే.. త్వరలో కేంద్ర కేబినెట్ లో వైసీపీ ఎంపీలు కొలువుదీరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపస్తున్నాయి.

అయితే ఈ పర్యటనలో జగన్ ఆత్రం కనిపించిందే కానీ.. ఎక్కడా బీజేపీ బయటపడడం లేదు. ప్రత్యేక ప్రకటనలు చేయడం లేదు. జగన్ ఢిల్లీలో అడుగుపెడుతున్నారనగా నేషనల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, ముందస్తు ముచ్చట, వైసీపీలో ఎన్డీఏ చేరిక వంటి వాటిపై కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో నీలి మీడియా కూడా అనుసరించింది. దీని బట్టి ఇది వైసీపీ చేసిన హంగామాగా అర్ధమైపోయింది. అయితే ముందస్తుకు వెళతాను వెళతాను అంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఎందుకు వారిస్తుంది? కానీ జగన్ అండ్ కో మాత్రం చేస్తున్న అతి మాత్రం విమర్శలకు దారితీస్తోంది.