YS Family Controversy: వివేకానంద రెడ్డి హత్య కేసు చాలదన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మరో కేసు వెంటాడుతోంది. అదే కడపలోని పెద్ద దస్తగిరి హత్య కేసు. ఈ కేసులో ఇప్పుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ హత్య వెనుక రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో.. లోతుగా అన్వేషణ ప్రారంభించారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ ఈ కేసులో లొంగిపోయారు. తెర వెనుక ఉన్న రాజకీయ ప్రముఖుల పేర్లు బయటపెట్టారు. దీంతో ఇదో హై ప్రొఫైల్ కేసుగా మారనుంది. కడప జిల్లాలో అసలే ఇబ్బందుల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్. కచ్చితంగా కూటమి దీనిని ఒక ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది.
* కొద్ది రోజుల కిందట హత్య..
కొద్దిరోజుల కిందట కడపకు చెందిన పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు ఆస్తివ్యవహారాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మరింత దర్యాప్తు చేయగా జగన్మోహన్ రెడ్డి మేనమామ పేరు బయటకు వచ్చింది. రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరి బినామీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల విలువైన భూమి వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ భూమిని పెద్ద దస్తగిరి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద దస్తగిరిని కొడితే ఆయన తిరస్కరించారు. అందుకే పెద్ద దస్తగిరిని అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళికతో హత్య చేయించారు. కానీ పోలీసుల దర్యాప్తులో రవీంద్రనాథ్ రెడ్డి పేరు బయటపడింది. దీంతో ఆయన అరెస్టు ఉంటుందన్న ప్రచారం కడపలో జరుగుతోంది.
* లొంగిపోయిన మాజీ డిప్యూటీ మేయర్..
ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి లొంగిపోయారు. ఈ కేసులో తనను ఇరికించడంతో ఆయన లొంగిపోయి రవీంద్రనాథ్ రెడ్డి పేరు బయట పెట్టేశారు. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య అంశంతో జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఏకంగా మేనమామ కూడా హత్య కేసులో ఇరుక్కునే పరిస్థితి దాపురించింది. తద్వారా పొలిటికల్ గా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడానికి వివేకానంద రెడ్డి హత్య అంశమే కారణం. అది తేలకముందే వైయస్ ఫ్యామిలీలో ఒకరు ఇలా హత్య కేసులో ఇరుక్కోవడం చూస్తుంటే.. మున్ముందు ఈ కేసు పరిణామాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.