Jagan Tenali Tour : వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) తెనాలిలో పర్యటించారు. దీనిపై పొలిటికల్ ఫైట్ కొనసాగింది. జగన్ పర్యటనను తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. క్రిమినల్స్ ను పరామర్శించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ముగ్గురు యువకుల అరాచకాలకు సంబంధించి సి సి ఫుటేజ్ కూడా రిలీజ్ చేసింది. అయితే బాధితులను క్రిమినల్స్ గా చిత్రీకరిస్తున్నారని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన రాజకీయ కాక రేపింది. కొద్ది రోజుల కిందట తెనాలిలో ముగ్గురు యువకులపై నడిరోడ్డులో పోలీసులు లాఠీ తో కొట్టిన వీడియోలు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి రచ్చ రచ్చ ప్రారంభం అయ్యింది. నేర ప్రవృత్తికి అలవాటు పడడం, కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి దిగడం వల్లే తాము అలా చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రకటించారు. అయితే ఏపీలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత బాధితుల పరామర్శకు తెనాలి వెళ్లారు.
* వివాదం ప్రారంభం..
ఈరోజు తాడేపల్లి( Tadepalli) నుంచి తెనాలికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తెనాలిలోని ఐతానగర్ లో బాధితులను పరామర్శించారు. అయితే ఈ పర్యటనపై ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. జగన్ తెనాలి పర్యటనను తీవ్రంగా తప్పుపడుతోంది తెలుగుదేశం పార్టీ. ఆ ముగ్గురు రౌడీషీటర్లు అని.. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టిడిపి నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని.. వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురు యువకులు గతంలో టిడిపి నేత కుమారుడిని నడిరోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారో చూడండి అంటూ ఓ సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా టిడిపి రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ముగ్గురు క్రిమినల్స్ అని.. బాధితులు కారని అంటుంది. అలాంటి క్రిమినల్స్ కు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడం ఏమిటనేది ప్రశ్నిస్తోంది.
* ప్రజా సంఘాల నిరసన..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజా సంఘాలు కూడా నిరసన చేపట్టాయి. మార్కెట్ సెంటర్లో( market centre) నిరసనకు దిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హత్యకు గురైన కిరణ్ ను పరామర్శించని జగన్.. ఇప్పుడు రౌడీ షీటర్లకు మాత్రం ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని.. రాజకీయాల కోసం కులాలు, మతాలు అంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని టిడిపి మండిపడుతోంది. ఆ ముగ్గురిపై ఎన్నో కేసులు ఉన్నాయని టిడిపి నేతలు చెబుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
* నేతల భిన్న స్పందన..
మరోవైపు తెనాలి( Tenali) ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పోలీస్ శాఖ పై విమర్శలు చేస్తున్నారని.. ఏం చేయకపోతే పని చేయడం లేదని చెబుతున్నారని.. ఇలా విచారణలో భాగంగా శాంతిభద్రత నియంత్రిస్తే ఇలా లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతమైన తెనాలిలో గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ స్పందించారు. దళిత యువకులపై జరిగిన దాడిని ఖండించారు. వారిపై రౌడీషీట్లు లేవని.. సోషల్ మీడియాలో వీడియోలు బయటకు రావడంతోనే రౌడీషీట్ తెరిచారని అన్నారు జీవీ హర్ష కుమార్. మొత్తానికి అయితే జగన్ తెనాలి టూర్ వార్ గా మారింది.