YS Avinash Reddy Out: సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ( Y S Jagan Mohan Reddy )గట్టి షాక్ తగిలింది. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. టిడిపి అభ్యర్థికి ఆరువేలకు పైగా ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు మాత్రమే వచ్చాయి. పూర్తిగా అధికార దుర్వినియోగంతో టిడిపి గెలిచిందని వైసీపీ చెబుతోంది. అయితే పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడంతోనే తమకు సంపూర్ణ విజయం తగ్గిందని టిడిపి చెబుతోంది. అయితే వైసిపి ఆరోపిస్తున్నట్టు అధికార దుర్వినియోగం జరిగినా.. ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించడం మాత్రం వైసీపీకి మింగుడు పడడం లేదు. మరోవైపు భవిష్యత్తుపై ఆ పార్టీకి బెంగ కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గంలోనే ఓటమి ఎదురైందంటే.. మిగతా చోట్ల ఎలా ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో సొంత జిల్లాలోని మార్పులకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
వరుస ఓటములతో…
మొన్నటి సాధారణ ఎన్నికల్లో కడప జిల్లాలో( Kadapa district ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట కూటమి విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. రాజశేఖర్ రెడ్డి హవా ప్రారంభం అయిన తర్వాత కడప జిల్లా పై పూర్తి పట్టు కొనసాగుతూ వచ్చింది. అటువంటిది తొలిసారి భారీ ఓటమి ఎదురు కావడం ఆ పార్టీని ఆందోళనలో నెట్టింది. ముఖ్యంగా పులివెందులలో ఏకపక్షంగా గెలుపొందుతూ వస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడూ రికార్డ్ స్థాయి మెజారిటీ సాధిస్తూ వచ్చింది. అటువంటిది ఓట్ల విషయంలో ఘోరంగా వైఫల్యం చెందడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 2029లో ఇదే తరహా ప్రభావం ఉంటే మాత్రం ప్రమాదం తప్పదని అంచనా వేస్తోంది.
వివేకా హత్య కేసు ప్రభావం..
మరోవైపు వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య అంశం పులివెందులలో కచ్చితంగా పనిచేస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల కంటే.. జడ్పిటిసి ఉప ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడాల్సి వచ్చింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనే పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న ఐదేళ్లు ఇన్చార్జిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతున్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి హత్య అంశం బాగా ప్రజల్లో ఉంది. అందుకే అవినాష్ రెడ్డి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డిని తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: విశాఖకు మరో గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్!
తెరపైకి సతీష్ రెడ్డి..
పులివెందులలో అవినాష్ రెడ్డి ( y s Avinash Reddy) స్థానంలో సతీష్ రెడ్డిని జగన్ తెస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. గతంలో చాలాసార్లు పులివెందుల నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు సతీష్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డికి పూర్తి విధేయుడుగా ఉంటున్నారు. ఆపై నియోజకవర్గంపై పట్టు ఉంది. అందుకే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు కానీ.. మైదుకూరు కానీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?