Y S Jagan Mohan Reddy Surrender Politics: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) రాజకీయాలు జాతీయస్థాయిలో అంతుపట్టడం లేదు. చంద్రబాబు భాగస్వామ్యమైన పార్టీకి, ప్రభుత్వానికి ఆయన జై కొడుతున్నారు. ఎక్కడైనా తన రాజకీయ ప్రత్యర్థి ఒక కూటమిలో ఉంటే.. దానిని ఎవరైనా వ్యతిరేకిస్తారు. కానీ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అలా జరగడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన బాహాటంగానే మద్దతు తెలుపుతున్నారు. అదే కూటమిలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఇట్టే తెలుస్తోంది. తన పాత కేసులు తెరపైకి రాకుండా.. కేంద్ర పెద్దలకు తనపై కోపం రాకుండా.. ఈ విధంగా చేస్తున్నారని జాతీయ పార్టీలు సైతం గుర్తించాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి వైఖరిని పట్టించుకోవడం మానేసాయి. అసలు బిజెపి వ్యతిరేక విపక్ష కూటమి జగన్మోహన్ రెడ్డిని లెక్కలోకి తీసుకోవడమే లేదు.
* వ్యతిరేకించిన కేటీఆర్..
నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో భారతీయ జనతా పార్టీని నమ్మలేమని.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తిరుగుబాటు చేయక తప్పదని కేటీఆర్ ప్రకటించారు. కానీ ఆయన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం మారు మాట అనకుండా మద్దతు ప్రకటించేశారు.. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంపు జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళన తమిళనాడుతో పాటు కర్ణాటకలో ఉంది. దానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పోరాడుతున్నారు. అక్కడ విపక్షంగా ఉన్న కేటీఆర్ సైతం బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పని చేయకపోగా.. అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు తమ అధినేత సింహం అని చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి.
* వారిది తప్పులేదు..
ఎన్డీఏ( National democratic Alliance ) పక్షంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపితే దానిని ఏమీ అనలేం. ఎందుకంటే కేంద్రంలో బిజెపి తీసుకునే నిర్ణయాలతో వచ్చే లాభనష్టాలను ఆ పార్టీతో పాటు ఆ రెండు పార్టీలు అనుభవిస్తాయి. కానీ తనది తటస్థ వైఖరి అని.. ఏపీ ప్రజల మేలుకోసమేనని జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. కానీ పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తోటి రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో తటస్థ వైఖరి ప్రదర్శించాలి. అవసరం అనుకుంటే తోటి రాష్ట్రాలతో పోరాటం చేయాలి. కానీ అవేవీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి బాహటంగా మద్దతు తెలపడం ఏమిటి అనేది ప్రశ్న.
* తప్పు పడుతున్న జాతీయ పార్టీలు..
జగన్మోహన్ రెడ్డి వైఖరిని జాతీయ పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. ఆయన ఎలా ఏపీ ప్రజల అభిమానాన్ని పొందారో తెలియడం లేదని అనుమానిస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి రాష్ట్ర అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది ముమ్మాటికి సరెండర్ పాలిటిక్స్ అని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న ఈ స్టాండ్ ఆయనను కేసులు, జైలు నుంచి కాపాడ వచ్చేమో కానీ.. ఒక నాయకుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్ మాత్రం దెబ్బతీస్తున్నాయి.