Botsa Satyanarayana: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మొన్న ఆ మధ్యన మీడియా ఎదుట ఆయన బోరున విలపించారు. అప్పట్లో వైయస్ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశానని.. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ బొత్స మాట్లాడారంటూ టిడిపి నుంచి కౌంటర్ ఆటాక్ వచ్చింది. వెంటనే విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బొత్స నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ బోరున విలపించారు. అటు తరువాత పెద్దగా కనిపించడం మానేశారు. దీంతో బొత్స సైలెన్స్ కు కారణం ఏంటి అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. రకరకాలుగా ప్రచారం సాగుతోంది.
* అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు..
అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బొత్స చేసిన కామెంట్స్ ను టిడిపి మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు సమయంలో, బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకానొక దశలో రాజశేఖర్ రెడ్డి మందు ముట్టనిదే రోజు గడిచేది కాదు అంటూ బొత్స వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా టిడిపి పాత క్లిప్పింగులతో పాటు వీడియోలను మీడియా ముందు పెట్టింది. టిడిపి మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఒకే ఒక్క మాట అన్నారు. కానీ అంతకుమించి బొత్స పై విమర్శలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పై బొత్స ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మరోసారి తెలుగు ప్రజలు గుర్తు చేసుకున్నారు.
* జగన్ అనుమానిస్తున్నారట..
మరోవైపు బొత్స రోదించడం వెనుక మరో కారణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. బొత్సపై వచ్చిన ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారా? అన్న బాధతోనే ఆయన ఏడ్చారు అంటూ లైట్ తీసుకున్నారు. అయితే తర్వాత బొత్స సత్యనారాయణ పై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. పరస్పర ప్రయోజనాల కోసం మాత్రమే బొత్సను జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు కానీ.. ఆయనను వైసీపీలో చేర్పించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత బొత్స కూడా పెద్దగా కనిపించలేదు. ఇప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో అలాంటి విమర్శలు వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. మరోవైపు క్రియాశీలక రాజకీయాలకు బొత్స గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?