Jagan And Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిని( sajjala Ramakrishna Reddy ) జగన్ పక్కన పడేశారా? ఆయన ప్రాధాన్యత తగ్గుతోందా? పార్టీ శ్రేణులు ఆయనను పట్టించుకోవడం లేదా? చివరకు సాక్షి మీడియాలో సైతం సజ్జల కనిపించరు ఎందుకు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఓడిపోయిన తర్వాత అందరి వేళ్ళు సజ్జల వైపు చూపించాయి. ఆయన తీరుతోనే ఓటమి చెందాల్సి వచ్చిందని చాలామంది సీనియర్లు సైతం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు జగన్ సైతం పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్లీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్టీలో అందరూ దూరం కావడంతో.. గతి లేని పరిస్థితుల్లోనే సజ్జలను జగన్ దగ్గరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల సజ్జల ప్రకటనలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డికి డామేజ్ చేశాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీ వర్గాల్లో సైతం ఆగ్రహాన్ని రేపుతోంది.
* మూడు రాజధానుల విషయంలో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానిపై జగన్మోహన్ రెడ్డి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా మాట్లాడారు. మూడు రాజధానుల అంశంపై గట్టిగానే వాయిస్ వినిపించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులు సృష్టించారు. దారుణంగా వారిని అవమానించడంలో సజ్జల పాత్ర ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించారన్న విమర్శ కూడా సజ్జలపై ఉంది అమరావతి విషయంలో. ఇప్పుడు అదే సజ్జల అమరావతిపై జగన్ అనుకూలంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే అమరావతి నుంచి పాలన సాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని పలుచన చేసింది. అయితే తాను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డికి అదే ఫైనల్ అన్నట్టు తాజాగా చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అందుకే సజ్జలను పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
* జర్నలిజం నుంచి రాజకీయం వైపు..
తొలినాళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు విలేఖరి( Eenadu reporter). గ్రామీణ మండలాల వార్తలు రాసే ఒక సాధారణ రిపోర్టర్. తరువాత ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి.. జూనియర్ సబ్ ఎడిటర్గా విధుల్లో చేరారు. తరువాత ఆంధ్రభూమిలో విధులు నిర్వహించారు. ఉదయం పత్రికలో సైతం పని చేశారు. తరువాత గ్రానైట్ వ్యాపారంలో ప్రవేశించి ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. సాక్షి దినపత్రిక ఆవిర్భావంతో ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్గా వ్యవహరించారు. అలా జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు పదవి లభించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో తన పట్టును పెంచుకున్నారు. నెంబర్ 2 స్థాయికి ఎదిగారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడి తనని బుక్ చేశారని జగన్మోహన్ రెడ్డిలో ఆగ్రహం ఉంది. పైగా మూడు రాజధానుల విషయంలో సైతం ఇదే మాదిరిగా సలహాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని.. సజ్జల విషయంలో ఎవరు ఎటువంటి ఆదేశాలు పాటించవద్దని పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.