Actor Ali
Actor Ali: అలీ కి జగన్ మరోసారి షాక్ ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను బయటపెట్టినా జగన్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అలీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చాలా నియోజకవర్గాల పేర్లు కూడా వినిపించాయి. కానీ నిన్న ప్రకటించిన ఫైనల్ జాబితాలో అలీకి చోటు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలీ ఆశలు తీరలేదని తేలింది.
అలీ చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. 2014 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.2019 ఎన్నికల్లో అయితే అలీ ఎక్కని గుమ్మం లేదు. అన్ని పార్టీలను ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ లేకపోవడంతో వైసిపిలో చేరారు. అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో వైసీపీలో చాన్స్ లేకుండా పోయింది. దీంతో ఆ ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమయ్యారు అలీ.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. వక్ బోర్డు చైర్మన్, రాజ్యసభ, ఎమ్మెల్సీ.. ఇలా చాలా పదవులు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అంటూ ఒక పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ అన్న ఆసక్తితో అలీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగారు.అలీ రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ఒకసారి.. కాదు కాదు నంద్యాల, కర్నూలు ఎంపీ స్థానం నుంచి బరిలో దిగుతారని మరోసారితెగ ప్రచారం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో అలీ సర్వే కూడా చూపించారని.. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో.. జగన్ సైతం అలీని తప్పకుండా పోటీలో దించుతారని టాక్ నడిచింది. కానీ తుది జాబితాలో పేరు లేకుండా పోయింది.
వాస్తవానికి అలీకి జనసేన అధినేత పవన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ కు అత్యంత ఆత్మీయుడు కూడా. ఇదే అలీ జనసేనలో కొనసాగి ఉంటే ఈసారి టిక్కెట్ తప్పకుండా దక్కేది. కానీ జగన్ పై నమ్మకం పెట్టుకొని స్నేహితుడైన పవన్ ని దూరం చేసుకున్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో సైతం అలీ చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని.. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశించినా సిద్ధంగా ఉన్నట్టు అలీ ప్రకటించారు. కానీ జగన్ మాత్రం కరుణించలేదు.అలీని అభ్యర్థిగా ప్రకటించలేదు. మరి అలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.