Jagan Active Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లు, కీలక నేతలతో సమావేశం అయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు. కూటమి ఏడాది పాలనలో దారుణంగా విఫలమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఏడాది పాలనలోనే ఓ ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత చూడలేదని చెప్పారు. తద్వారా పోరాడితే భవిష్యత్తు మనదేనంటూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గట్టి సాహసమే చేస్తున్నారు. పార్టీ శ్రేణులను క్రియాశీలకం చేసే పనిలో పడ్డారు. వారిని కార్యోన్ముఖులు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నం వర్కౌట్ అయితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు.
Also Read: మృత్యువు సెంటీమీటర్ దూరంలో ఆగింది.. భూమ్మీద నీకు నూకలు ఉన్నాయి భయ్యా: వైరల్ వీడియో
* సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ..
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా( opposition status) కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రజలు దారుణంగా ఆ పార్టీని తిరస్కరించారు. అయితే ఆ అవమాన భారం నుంచి బయటపడేందుకు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. కానీ చాలా వేగంగా కోలుకున్నారు. ప్రజల మధ్యకు వచ్చారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెప్పారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. పార్టీని యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. ఒక గాడిన పెట్టే ప్రయత్నం చేశారు.
* శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు..
అయితే నేతలు ఒకవైపు రాజీనామా చేయడం.. ఇంకోవైపు కేసులు చుట్టుముట్టడం.. చాలామంది సీనియర్లు( senior leaders) మౌనం దాల్చడం వంటి కారణాలతో పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత కనిపిస్తోంది. దూకుడు కలిగిన నేతలంతా జైలు పాలయ్యారు. కేసులను ఎదుర్కొంటున్నారు. మరికొందరు కేసులకు భయపడి అజ్ఞాతంలో గడుపుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం ఒకవైపు.. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం మరోవైపు.. వచ్చే ఎన్నికలు నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం ఇంకోవైపు అన్నట్టు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం చాలా భయపడుతున్నాయి. భవిష్యత్ పై ఆశలు వదులుకుంటున్నాయి. 2019 ఫలితాలు రిపీట్ కావాలంటే చాలా కృషి చేయాలి. అప్పట్లో వన్ చాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లడంతో వారు ఆదరించారు. అయితే ఐదేళ్ల జగన్ పాలన చూసిన ప్రజల్లో ఒక రకమైన చేంజ్ వచ్చింది. అప్పటి మాదిరిగా వన్ చాన్స్ అనే నినాదం ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నమ్ముకున్నారు.
* ప్రభుత్వ వ్యతిరేకత పై నమ్మకం..
జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకున్నారు. కానీ ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు( CM Chandrababu) రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క పథకం అమలు చేసే పనిలో పడ్డారు. అదే సమయంలో అభివృద్ధి పనులకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించారు. ప్రభుత్వంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పై మాత్రం వ్యతిరేకత ఉంది. దానిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. తద్వారా వాటిని ఎక్కువగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులకు దానిపైన ఎక్కువగా దిశా నిర్దేశం చేశారు.