CM Jagan: వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదా? దాదాపు 70 చోట్ల సిట్టింగ్లను జగన్ మార్చారు. ఇంకా మార్చుతారని ప్రచారం జరిగింది. కానీ ఒకటో అరో తప్పించి.. మిగిలిన వారందరికీ టిక్కెట్లు ఖాయమేనని జగన్ తేల్చి చెప్పారు. తాజాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి లతో జగన్ సమావేశం అయ్యారు. ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన మార్పులతో ముగిస్తున్నానని.. మార్పులు లేని చోట సిట్టింగులే అభ్యర్థులని తేల్చి చెప్పారు. దీంతో మిగతావారు ఊపిరి పీల్చుకున్నారు. తమకు మార్చే ఉద్దేశం లేదని తెలుసుకొని ఆనందపడుతున్నారు.
ఇప్పటివరకు జగన్ ఏడు జాబితాలను ప్రకటించారు. 70 మంది వరకు సిట్టింగ్లను మార్చారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మంత్రులను ఎంపీలుగా స్థాన చలనం కల్పించారు. ఈ నేపథ్యంలో చాలామంది పార్టీకి దూరమయ్యారు. మిగతావారు కూడా భయం భయంగా గడిపారు. దాదాపు 100 మంది వరకు మార్చుతారని ప్రచారం జరగడంతో.. తమ సీటుకు ఎసరు తప్పదని చాలామంది ఆందోళన చెందారు. అయితే అభ్యర్థుల మార్పు ఇంతటితో ముగిస్తున్నట్లు జగన్ స్వయంగా ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాము సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టేనని భావిస్తున్నారు.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మంగళగిరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ బాధ్యులతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసే మంచిని వివరించాలని సూచించారు. నేను చేయాల్సిందంతా చేశానని.. ఇక ఈ 45 రోజులు పాటు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని జగన్ సూచించారు. ఈసారి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ మెజారిటీ రావాలని.. మరోసారి తిరుగులేని విజయం పొందాలని పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పార్టీ జెండా ఎగురువేయాలని కూడా పిలుపునిచ్చారు. అయితే జగన్ తన ప్రసంగంలో ఇక మార్పులు ఉండబోవని.. ఉన్న సిట్టింగులనే కొనసాగిస్తామని సంకేతాలు ఇవ్వడంతో చాలామంది ఖుషి అయ్యారు. అయితే జగన్ బహిరంగ సభల మాదిరిగానే సమావేశానికి వచ్చిన కొంతమంది నేతలు మధ్యలోనే వెనుతిరగడం విశేషం.