Jayadev Galla: గల్లా జయదేవ్ ని వెంటాడిన జగన్ సర్కార్.. నిష్క్రమణ వెనుక కారణం అదా?

ఉమ్మడి ఏపీలో గల్లా కుటుంబానికి సుదీర్ఘ నేపథ్యం. అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్న గల్లా రామచంద్రరావు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ పేరిట భారీ పరిశ్రమలను ఏర్పాటు చేశారు.

Written By: Dharma, Updated On : June 25, 2024 8:21 am

Jayadev Galla

Follow us on

Jayadev Galla: ఈ ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి నిష్క్రమించారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఆయన స్థానంలో పోటీ చేసిన మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అయ్యారు. కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఎంపికయ్యారు. ఒకవేళ గల్లా జయదేవ్ మూడోసారి పోటీ చేసి గెలిచి ఉంటే.. ఆయనే కేంద్ర క్యాబినెట్లో మంత్రి అయ్యేవారు. కానీ గత ఐదేళ్లుగా జరిగిన రాజకీయాలను తలచుకొని ఆయన నిష్క్రమించారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ గల్లా జయదేవ్ ని వెంటాడింది. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టింది. తాజాగా గల్లా జయదేవ్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చిత్రహింసలకు గురైనట్లు ఆ వీడియోలో ఉంది.

ఉమ్మడి ఏపీలో గల్లా కుటుంబానికి సుదీర్ఘ నేపథ్యం. అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్న గల్లా రామచంద్రరావు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ పేరిట భారీ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ కుటుంబానికి గౌరవం ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 2003లో పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు గల్లా అరుణ కుమారి. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరారు.అటు రాజకీయాలు చేస్తూనే తమ పరిశ్రమలను తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని భావించారు.

2014లో గుంటూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ ఎంపీగా ఎన్నికయ్యారు. స్వతహాగా పారిశ్రామికవేత్త కావడం, విద్యాధికుడు కావడంతో పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ప్రత్యేక హోదా గురించి గళమెత్తేవారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరుణంలో.. ఆ పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. శత్రువు శత్రువు మిత్రుడు అన్న కోణంలో జగన్ బిజెపి పెద్దలకు దగ్గర అయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గల్లా జయదేవ్ ని టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఒకానొక దశలో గల్లా జయదేవ్ వైసీపీలో చేరతారని.. ఆ మేరకు ఆయన పై ఒత్తిడి పెరిగిందని కూడా టాక్ నడిచింది. కానీ జయదేవ్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమపై వైసీపీ సర్కార్ దాడులు చేయించింది. పర్యావరణ అనుమతులకు మించి ఉత్పత్తులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. లేనిపోని తనిఖీల పేరుతో హడావిడి చేసింది. దీంతో అమర్ రాజా యాజమాన్యం తమ పరిశ్రమ విస్తరణను ఏపీలో నిలిపివేసి.. తెలంగాణ వైపు అడుగులు వేసింది.

అయితే ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి నిష్క్రమించారు గల్లా జయదేవ్. కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరమవుతానని చెప్పి మరి బయటకు వెళ్లిపోయారు గల్లా జయదేవ్. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచినా.. తెర వెనుక గల్లా కుటుంబాన్ని జగన్ సర్కార్ వెంటాడినట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు బయటపడిన వీడియోలో గల్లా జయదేవ్ ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని.. స్టేషన్లో చొక్కా విప్పి మరి హింసించారని ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇది ఎప్పుడు? ఎక్కడ? అన్నది మాత్రం తెలియడం లేదు. వీడియో పై ఏబీఎన్ లోగో ఉంది. కేవలం చిత్రహింసలకు గురి చేసే గల్లా జయదేవ్ టిడిపి నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారని మాత్రం ప్రచారం జరుగుతోంది. దీనిపై జయదేవ్ నోరు తెరిస్తే గాని బయటకు తెలిసే పరిస్థితి లేదు.