Jagan: నమ్మకం.. ఈ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నమ్మకం ఉండాలి తప్ప.. అదే నమ్మకాన్ని గుడ్డిగా ఫాలో కాకూడదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) చేస్తోంది అదే. ఏకంగా పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టేశారు. తాను పార్టీ అధినేతగా కొనసాగుతుండగా.. పార్టీలో అత్యంత విలువైన రాజకీయ వేదికగా ఉన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సజ్జల వారిని చైర్మన్ చేశారు. అంటే తన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే సజ్జల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. కానీ జగన్మోహన్ రెడ్డి దానిని విశ్వసించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి పై నమ్మకం పెట్టుకొని ఏకంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.
Also Read: సొంత పార్టీని ఓడించాలని చూసిన మాజీ మంత్రి.. నిజం ఎంత?
* క్రమేపి ప్రాధాన్యత పెంచుతూ..
సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండేవారు. అటువంటి వ్యక్తిని తెచ్చి పార్టీ కార్యక్రమాలను అప్పగించారు. పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. చివరకు పార్టీలో కూడా విశేష హక్కులు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి తో నడిచిన నేతలకు ఇది మింగుడు పడని విషయం. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్లు సజ్జల విషయంలో భిన్నభిప్రాయాలతో ఉన్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని సజ్జలను తమపై రుద్దడాన్ని ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి అధికారంలో ఉండేటప్పుడు ఏ నిర్ణయం అయినా చెల్లి పోయింది. కానీ ఇప్పుడు సజ్జలను తమపై వేయడం ఏమిటన్న అభిప్రాయం సీనియర్లలో ఉంది.
* కొత్తగా అధ్యక్ష పదవి..
తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party ) పోలిట్ బ్యూరో ఉంది. దానిలో దాదాపు 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. దానికి అధ్యక్ష పదవి అంటూ లేదు. పార్టీ అధినేత చంద్రబాబు.. పొలిట్ బ్యూరో సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆయన మార్గదర్శకంలోనే అత్యున్నత సమావేశంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో అందుకు భిన్నం జరుగుతోంది. ఏకంగా ఆ కమిటీ అధ్యక్ష బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. ఇది ఎంత మాత్రం వైసీపీ సీనియర్లకు రుచించడం లేదు. సజ్జల తీరు వల్లే పార్టీ ఓడిపోయింది అన్నది ఎక్కువమంది అభిప్రాయం. అటువంటి వారంతా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
* పార్టీతో పాటు ప్రభుత్వంలో పెత్తనం..
గత ఇదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీతో పాటు ప్రభుత్వం పై పెత్తనం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కుమారుడు భార్గవరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని చూసేవారు. ఈ ఇద్దరు తండ్రి కుమారులు ఆర్థికంగా బలపడ్డారు. కానీ పార్టీకి మైనస్ చేశారు అన్నది సీనియర్ నేతల అభిప్రాయం. అందుకే సీనియర్లు సజ్జల తాజా నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరి తీరుతో ఓటమి చెందామో.. అటువంటి వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల నియామకం వివాదానికి దారి తీసినట్టు ఉంది.