Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు( ambati Rambabu) అధినేత జగన్ ( Jagan Mohan Reddy) షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త నేతను తీసుకొచ్చారు. సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని( Sudheer Bhargava Reddy ) నియమించారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంబటి రాంబాబును పక్కన పెడుతూ సుధీర్ భార్గవ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వైసీపీలో ఇదొక సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పరాజయం ఎదురైంది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ తరుణంలో పార్టీలో సమూల మార్పులకు దిగారు జగన్. రీజినల్ కోఆర్డినేటర్లను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షులను భర్తీ చేశారు. అవసరం అనుకున్న చోట ఇన్చార్జిలను మార్చుతున్నారు.
వాస్తవానికి అంబటి రాంబాబు( ambati Rambabu) జగన్కు అత్యంత విధేయుడు. కాంగ్రెస్ పార్టీని జగన్ విభేదించినప్పుడు ఆయనకు అండగా నిలబడ్డారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ధిక్కారస్వరం వినిపించారు. వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే వైసీపీ కోసం కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలిచేసరికి జగన్ తన క్యాబినెట్ లోకి అంబటి రాంబాబును తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందు అంబటి కి టికెట్ ఇవ్వరని ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్నారు అంబటి. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో అంబటిని తప్పించి కొత్తగా యువ డాక్టర్ను తెరపైకి తెచ్చారు జగన్.
* సంచలన నిర్ణయమే
అంబటి రాంబాబును తప్పించడం ఇప్పుడు వైసీపీలో( YSR Congress ) హాట్ టాపిక్ అవుతోంది. అయితే తొలుత ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే గా ఉన్న రామకృష్ణారెడ్డిని( alla Ramakrishna Reddy )తీసుకువచ్చి సత్తెనపల్లి ఇన్చార్జి చేస్తారని టాక్ నడిచింది. దీనిపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు కూడా. నియోజకవర్గ ఎల్లలు, సరిహద్దులు తెలియని నేతలు ఎలా వస్తారని ప్రశ్నించారు కూడా. అయితే ఇంతలో డాక్టర్ సుధీర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అందుకోసమే అంబటిని తప్పించి సుధీర్ రెడ్డిని తెచ్చినట్లు ప్రచారం అయితే నడుస్తోంది. దీనిపై అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
* పొమ్మన లేక పొగ
సాధారణంగా నియోజకవర్గ ఇన్చార్జి పోస్టులను కదిలించాలనుకుంటున్న సీనియర్లకు.. పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేని సీతారాం( tammineni Sitaram ) ను తప్పించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం బాధ్యతలను అప్పగించారు. అయితే అది పొమ్మన లేక పొగ అన్నట్టు స్పీకర్ తమ్మినేని భావించారు. అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా అలానే జరుగుతోంది. దీంతో ఆయన నిర్ణయం కీలకంగా మారనుంది.
* సొంత నియోజకవర్గం
కాగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన సుధీర్ భార్గవ్ రెడ్డిది( Sudheer Bhargava Reddy ) ఇదే సొంత నియోజకవర్గం. ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నారు. ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ గా పేరొందారు. సుధీర్ భార్గవరెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి కూడా వైసీపీ నేత. సత్తెనపల్లి నియోజకవర్గ వైసిపి పరిశీలకుడిగా పనిచేశారు. గతంలో నరసరావుపేట టిక్కెట్ ఆశించారు. కానీ వీలుపడలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన కుమారుడికి సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడం విశేషం. ఏకంగా దూకుడు తనం కలిగిన అంబటి రాంబాబును తప్పించి.. ఆ స్థానంలో యువ డాక్టర్ను నియమించడం విశేషం.