Jagan: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) వైఖరి వింతగా ఉంది. కనీసం ఆయన ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ అదే ధోరణి. చుట్టూ ఆ నలుగురు ఉంటే సరిపోయేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఇది కచ్చితంగా ఆ పార్టీకి మైనస్. ఏదైనా ప్రభుత్వం పై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. క్యాడర్ తో పని చేయిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు సరిపోతుంది కానీ.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అది ఇబ్బందికరమే. అది తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వారంలో మూడు రోజుల పాటు మాత్రమే తాడేపల్లి కి వస్తున్నారు. ఒక్క వారం రావడం లేదు కూడా. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీకి మైనస్.
* ఆందోళనలేవి?
జగన్ అధికారానికి దూరమై 16 నెలలు అవుతోంది. ప్రభుత్వంపై గట్టిగా ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా చేయలేదు. విశాఖ జిల్లా( Vishakha district) నర్సీపట్నం వచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపిస్తూ భారీ బలప్రదర్శనకు దిగారు. అయితే ఆయన వచ్చినప్పుడు జన సమీకరణ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులకు ఆందోళన చేయమన్నప్పుడు మాత్రం తాను పాలుపంచుకోవడం లేదు. తాజాగా 40 రోజుల పాటు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు నెలకు పైగా ఆందోళనలు జరపాలని సూచించారు. కానీ జగన్ మాత్రం అందుబాటులో ఉండరట. ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆయన రచ్చబండ కార్యక్రమానికి పిలుపునివ్వడం విశేషం.
* సజ్జలకు బాధ్యతలు..
అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి( sajjala Ramakrishna Reddy ) అప్పగించారు. ఆయన అన్ని జిల్లాల నేతలతో సమన్వయం చేసుకొని ఆందోళన కార్యక్రమాలు జరపాలని ఆదేశాలిస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్యాడర్ కు రుచించడం లేదు. అధినేత జగన్ లేకుండా ఈ ఆందోళనలు ఏమిటనే ప్రశ్నించేవారు ఉన్నారు. ఇదేం తీరు అని నిలదీసినంత పని చేసిన వారు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ను నిర్లక్ష్యం చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు వారిని ఒక ప్రయోగాలకు వినియోగించుకుంటున్నారు. తాను వస్తే జనాలు రావాలి. తాను లేకుండా మాత్రం ఆందోళన కార్యక్రమాలు జరిపించాలి. ఈ తీరును సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. జగన్ వైఖరి నచ్చక చాలామంది సీనియర్లు ఇంకా క్రియాశీలకం కావడం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావడం లేదు. ఇది ముమ్మాటికి ఆ పార్టీకి మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.