YS Jagan: వైసిపి అధినేత జగన్ (YS Jagan) సొంత నియోజకవర్గం పులివెందులను టిడిపి (TDP) సొంతం చేసుకుంది. పులివెందుల ప్రాంతంలో 65 ఎంపిటిసి స్థానాలలో.. 64 కూటమి సొంతమయ్యాయి. ఏడు జెడ్పిటిసి స్థానాలలో మూడు కూటమి సొంతం చేసుకుంది.
ఇదే నియోజకవర్గంలో వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 17 కూటమి సొంతం చేసుకుంది. ఇక పులివెందుల మండలంలో ఉన్న ఐదు ఎంపిటిసి స్థానాలలో టిడిపి అభ్యర్థులు.. వేంపల్లి మండలంలో ఉన్న ఎనిమిది ఎంపిటిసి స్థానాలలో టిడిపి అభ్యర్థులు.. చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు.. తొండూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు.. సింహాద్రిపురం మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలలో టిడిపి అభ్యర్థులు యునానిమస్ గా ఎన్నికయ్యారు.
సింహాద్రిపురం.. తొండూరు.. చక్రాయపేట జెడ్పిటిసి స్థానాలను టిడిపి తన ఖాతాలో వేసుకుంది. పులివెందుల పురపాలకంలో 20 వార్డులను కూటమి దక్కించుకుంది.. ఇవన్నీ కూడా ఏకగ్రీవంగానే.. వాస్తవానికి పులివెందుల అంటే అప్పట్లో వైయస్.. ఇప్పుడు జగన్.. కానీ ఈ కోట బద్దలైంది.. లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ స్థాయిలో టిడిపి దూకుడు చూపిస్తుందని.. పులివెందుల ప్రాంతంలో ఏక ఛత్రాధిపత్యం సాగిస్తుందని ఎవరూ అంతగా అంచనా వేయలేదు. స్థానిక ఎన్నికల్లో భయపెడుతున్నారు.. పోలీసులను దింపుతున్నారు.. నామినేషన్లను వేయనీయడం లేదు.. ఇది గెలుపు ఎలా అవుతుంది.. రాష్ట్రం మొత్తం ఇలానే సాగుతోంది.. అని వైసిపి ఆరోపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు.
కానీ, ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి.. ఏ ప్రాంతం కూడా.. ఏ రాజకీయ కూడా ఒక కుటుంబానికి మాత్రమే సొంతం కాదు. ఎల్లకాలమూ పాదాక్రాంతం కాదు. ఇప్పటికాలంలో పొలిటికల్ మర్యాదలు లేవు. అసలు ఆ కాలం ఎప్పుడో వెళ్లిపోయింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం జోలికి వెళ్లేవారు కాదు. పులివెందుల ప్రాంతం వైపు కూడా చంద్రబాబు కన్నెత్తి చూసేవారు కాదు. ఒకరకంగా నాన్ ప్రోటోకాల్ మర్యాదలు నాటి పాలిటిక్స్ లో కొనసాగేవి.
ఇప్పుడు లోకేష్ జమానా నడుస్తోంది. మొన్నటిదాకా జగన్ హవా కొనసాగింది. కుప్పం ఎందుకు కాకూడదు.. 175 ఎందుకు సాధించకూడదు అన్నాడు జగన్.. కానీ పరిస్థితి మారిపోయింది.. 175 నుంచి 11కు దిగజారిపోయాడు. అంతకుముందు చంద్రబాబు 23కు తగ్గిపోయాడు.. కానీ ఇదే సమయంలో సరిగ్గా గురి చూస్తే పులివెందుల మన చెంతకు రాదా అని లోకేష్ అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొట్టేశారు. సతీష్.. రాజేష్ చెంత ఉన్నారు కాబట్టి.. లోకేష్ ఇప్పట్లో తన దూకుడు తగ్గించకపోవచ్చు. ఆర్థికంగా సంపత్తి ఉంది. మీడియా పరంగా బలం ఉంది. పవన్ సపోర్ట్ దండిగా కనిపిస్తోంది. ఇలాంటప్పుడు లోకేష్ ముట్టుకుంటే బంగారం.. పట్టుకుంటే వజ్రం..
గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లలో జగన్ చేసిన పని ఇప్పుడు లోకేష్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు.. ఇందులో నిజం ఉందేమో.. గత లోకల్ బాడీ ఎలక్షన్లలో జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. దాని ప్రభావం ఎలా ఉంటుందో జగన్ కు వాస్తవంలోకి వచ్చేలాగా చేస్తున్నాడు లోకేష్. రేపటి నాడు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా.. అసలు దారులు మొత్తం మూసుకుపోయే విధంగా లోకేష్ తొక్కిస్తున్నాడు.
ఇక ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన తొలి రోజుల్లో.. పవన్ కళ్యాణ్.. నాగబాబు పెద్దగా పట్టించుకోని రోజుల్లో.. వ్యవహారాల మొత్తం అల్లు అరవింద్ చూసుకున్నారు. అప్పటికాలంలో అరవింద్ దూకుడుగా ఉన్నారు.. ఎవరో ఒక విలేకరి అడిగితే.. కుప్పం.. పులివెందుల మినహాయిస్తే మిగతా అన్నింటిని గెలుస్తామని చెప్పారు. పొలిటికల్ మర్యాద కోసం వాటిని వదిలేస్తున్నామని అన్నారు. కానీ అటువంటి తీర్పులను రాజకీయ నాయకులు తమకు తాముగా ఇచ్చుకోవచ్చు. కానీ ప్రజలు ఇచ్చేదే అంతిమం.
కుప్పం ఎందుకు కాకూడదు అని జగన్ అన్నప్పుడు.. పులివెందుల ఎందుకు దక్కకూడదు అని లోకేష్ చెప్పినప్పుడు.. ఇవేవీ అసాధ్యం కాని విషయాలు కాదు.. ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్.. సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు.. గజ్వేల్ ప్రాంతంలో కేసీఆర్ ఓడ కొట్టడం పెద్దగా సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతం ఒకరి చేతుల్లో ఎప్పటికీ ఉండదు. అక్కడిదాకా ఎందుకు 2023లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోలేదా.. అంతకుముందు రేవంత్ రెడ్డి పరాజయం పాలు కాలేదా.. పరిస్థితి ఇలానే ఉంటే.. రేపటినాడు తెలంగాణలో మాత్రం పులివెందుల ఫలితం రాదని లేదు కదా..