YS Jagan : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు డిసైడయ్యారు. పనితీరు బాగాలేని వారిని తప్పించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. సామాజికవర్గ సమీకరణలతో పాటు సంక్షేమానికి బలంగా నమ్ముకున్నారు. తన సర్కారు పథకాలతో లబ్ధిపొందిన వారు మాత్రమే తనకు మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే విపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేసి చిత్తు చేయాలని చూస్తున్నారు. కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.
టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కలుస్తుందా? లేదా? అన్న క్లారిటీకి రాలేకపోతున్నారు. కానీ కాషాయ దళం సైతం తప్పకుండా కలుస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే మూల్యం తప్పదని భావిస్తున్నారు. అందుకే వారు కలవకూడదని బలంగా కోరుకుంపన్నారు. టీడీపీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్న పవన్ కు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. 175 సీట్లకు పోటీచేసే దమ్ముందా? అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయలేని నువ్వా జగన్ ను ఓడించేంది? అసలు మీ పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారా? నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? ఎందుకీ బానిస బతుకు?..ఇలా నానా రకాల ప్రశ్నలతో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
జనసేన చర్యలు తమకు నష్టం చేస్తాయని జగన్ అండ్ కోకు తెలుసు. కాపు సామాజికవర్గం టీడీపీ, జనసేన కూటమి వైపు వెళుతుందని ముందే ఊహించారు. అయితే అది ఊహించలేని నష్టం అని తెలుసు. అందుకే ముద్రగడ ద్వారా మంట పెట్టాలని చూశారు. కాపులు కొంతవరకైనా తమ వైపు ఉంటారని ఆశించారు. అంతకు ముందే కాపులకు, ఉప కులాల మధ్య కుంపట్లు రగిల్చే ప్రయత్నం చేశారు. కాపులకు వ్యతిరేకంగా ఉన్న బీసీ కులాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ వర్గాల వారికి పదవులు ఇచ్చారు. జయహో బీసీ నినాదం పఠించారు. అయితే ఇవన్నీ భయంతోనే చేస్తున్నవే. పవన్ చర్యలను అడ్డకట్ట వేసేందుకు చేస్తున్నవే.
అధికార వైసీపీకి ఉన్న ఎకైక టాస్క్ పవన్ కళ్యాణ్. వారాహి యాత్ర ముందు.. తరువాత అన్న పరిస్థితి వచ్చింది. కాపు ఓట్లు మొత్తం పోలరైజ్ అయ్యాయి. ముద్రగడ ద్వారా చేసిన ప్రయత్నాలన్నీ వికటించాయి. చివరకు పోసాని కృష్ణమురళిని రప్పించి ప్రజారాజ్యం సమయంలో కాపులపై జరిగిన కుట్ర కథనాలను బయటపెట్టారు. కానీ ఇప్పుడున్న పొలిటికల్ సిట్యువేషన్ లో కాపులు చాలా లైట్ గా తీసుకున్నారు. అందుకే జగన్ ముద్రగడను పార్టీలో చేర్చుకుంటేనే కాపుల అంశానికి సంబంధించి విరుగుడు చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో ఉన్నారు. పాలన కంటే రాజకీయ ఎత్తుగడలకే ప్రాధాన్యమిస్తున్నారు.