Jagan Affection Towards Hyderabad: వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో కూటమి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ తో పాటు పాదయాత్ర మొదలు పెట్టాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు బెంగళూరులో ఉంటే మూడు రోజులు తాడేపల్లి లో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు వచ్చేయాలని చూస్తున్నారు.
అప్పట్లో లోటస్ ఫండ్ నుంచి..
2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. అప్పట్లో సీఎం చంద్రబాబు హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం హైదరాబాదులోని లోటస్ ఫండ్ లో ఉంటూ ఏపీకి వచ్చేవారు. అటు తరువాత తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి.. 2019 వరకు అక్కడే ఉండి.. ఏపీకి రాకపోకలు సాగించేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లికి పరిమితమయ్యారు. అధికారం కోల్పోయాక బెంగళూరు ప్యాలెస్ కు చేరుకున్నారు. అయితే సాటి తెలుగు రాష్ట్రాన్ని విడిచిపెట్టి బెంగళూరు నుంచి రాకపోకలు సాగించడం పై విమర్శలు వస్తున్నాయి. అందుకే హైదరాబాద్ కు మకాం మార్చాలని చూస్తున్నారు.
ఆ విమర్శలకు చెక్ పెట్టాలని..
బెంగళూరు నుంచి తాడేపల్లికి వారం వారం విమానాల్లో రావడంతో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అదే హైదరాబాద్ అంటే ఎవరు విమర్శించలేరు. ఎందుకంటే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ హైదరాబాదు నుంచి ఏపీకి వస్తుంటారు. అందుకే జగన్ హైదరాబాద్ వెళ్తే కూటమి నేతలు విమర్శించలేరు. పైగా హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ఉంటారు. వారిని కలిసేందుకు కూడా వీలు పడుతుంది.. పైగా రాజకీయ మిత్రులందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఆ పై సెంటిమెంట్ పరంగా కూడా లోటస్ ఫండ్ కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు షిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు. రోజులవ్యవధిలోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
