Homeఆంధ్రప్రదేశ్‌Jagan Manifesto: జగన్ మేనిఫెస్టో: ఏ వర్గాలకు లాభం.. ఏ వర్గాలకు నష్టం?

Jagan Manifesto: జగన్ మేనిఫెస్టో: ఏ వర్గాలకు లాభం.. ఏ వర్గాలకు నష్టం?

Jagan Manifesto: వైసీపీ మేనిఫెస్టో ప్రకటించింది. ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేసింది. తాము నమ్ముతున్న ఓటు బ్యాంకుగా చూస్తున్న వర్గాలను టార్గెట్ చేసుకుని ఈ మేనిఫెస్టో రూపొందించింది. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి నిర్దిష్టంగా పొందుపరచలేదు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలను వెల్లగొడుతున్నారని ఒక ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ ఆయా వర్గాలకు ఉపశమనం కలిగించే అంశాలు మేనిఫెస్టోలో లేవు. ఇది వైసీపీకి మైనస్ గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వస్తుందని ఎంతోమంది నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. వైసిపి ఉచిత పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం ఇబ్బందికర పరిణామమే.

గత ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని వైసిపి బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పటివరకు ఇస్తున్న సంక్షేమ పథకాల లబ్ది మొత్తాన్ని పెంచింది. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్సయింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచకుండా.. సంపద పంపిణీ చేస్తామని చెప్పడం.. చాలా వర్గాలకు మింగుడు పడని విషయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించి.. సంక్షేమ పథకాలతో నగదు పంచుతామని చెబుతోంది. అందుకు తగ్గట్టుగా మేనిఫెస్టో రూపకల్పన పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇదే జాగ్రత్తగా వైసీపీ కూడా తీసుకుంటుందని.. అందుకే మేనిఫెస్టో ప్రకటన ఆలస్యం అయినట్లు ప్రచారం జరిగింది. కానీ దూరమైన వర్గాలను దరి చేసుకునే వీలుగా..మేనిఫెస్టోలో ప్రత్యేక అంశాలను జత పరచకపోవడం ఒక లోటుగా కనిపిస్తోంది.

మేనిఫెస్టోలో ఉద్యోగ కల్పన ఊసు లేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేక వర్గాల్లో యువత ఒకరు. గత ఐదేళ్లగా ఎటువంటి ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగాలు అన్న మాట వచ్చేసరికి.. కేవలం సచివాలయ ఉద్యోగులను మాత్రమే చూపుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేసామని చెబుతున్నారు. కానీ నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీ ప్రధానమైనదని గుర్తించలేకపోయారు. ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నవరత్నాల్లో స్పష్టంగా రాశారు. దానిని అమలు చేయలేకపోయారు. అయితే దానిని నివృత్తి చేసే విధంగా.. కొత్త ప్రత్యామ్నాయంతోముందుకొస్తారని భావించారు. కానీ ఈ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల ప్రస్తావన లేదు. ఇది వైసీపీకి ప్రతికూలత చూపించే ఒక అంశం.

పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి ఎటువంటి మార్గాలు చూపుతారో ఈ మేనిఫెస్టోలో పొందుపరచలేదు. ఇతర రంగాల విషయంలో అసలు ప్రస్తావన లేదు. కేవలం మౌలిక వసతుల విషయంలో పొడిపొడి మాటలు చేర్చి మమ అనిపించేశారు. అయితే వైసిపి ప్రకటించిన మేనిఫెస్టోలో లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని.. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజాకర్షణగా తీర్చిదిద్దాలన్న భావనతో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం దానిపైనే కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. కేవలం తనకు ఓటు వేస్తారన్న వర్గాల సంక్షేమమే ప్రాధాన్యంగా వైసీపీ మేనిఫెస్టో ఉంది. కానీ ప్రభుత్వ బాధిత వర్గాలను తన వైపు తిప్పుకోవడానికి తప్పకుండా చంద్రబాబు ప్రయత్నిస్తారు. వైసీపీ కంటే మించి సంక్షేమం అమలు చేస్తామని ఆ పార్టీ ఓటు బ్యాంకు పై కూడా కచ్చితంగా ఫోకస్ చేస్తారు. ఇలా ఎలా చూసుకున్నా.. చాలా వర్గాలు వైసీపీ మేనిఫెస్టోపై అసంతృప్తిగా ఉన్నాయన్నది వాస్తవం. మరి దీనిని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version