Kethireddy Venkatramireddy Resign to YSR Conress
YSR Congress : వైసీపీకి( YSR Congress ) మరో షాక్ తప్పదా? ఆ పార్టీకి ఓ కీలక నేత గుడ్ బై చెబుతారా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల వైసిపికి కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో విజయసాయి రెడ్డి లాంటి కీలక నేత పార్టీలో ఉండడం లేదంటే.. మన పరిస్థితి ఏంటని ఎక్కువ మంది నేతలు ఆలోచన చేస్తున్నారు. కొంతమంది ఆయన మాదిరిగానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు యువ నేతలు మాత్రం కూటమి పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వార్త ఒకటి బయటపడింది. పార్టీ యువ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జనసేనలో చేరతారని ప్రచారం ప్రారంభం అయ్యింది.
* అనూహ్యంగా రాజకీయాల్లోకి..
తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( keti Reddy Venkat Ram Reddy) . వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రామిరెడ్డి తొలిసారిగా 2009 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో తీవ్ర ఆందోళన కు గురయ్యారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే వైసిపిలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు.
* ప్రత్యేక ఇమేజ్
2019 ఎన్నికల్లో మూడోసారి ధర్మవరం( Dharmavaram) నుంచి పోటీ చేసి గెలిచారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. భారీ మెజారిటీతో గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో తనకంటూ ఒక సొంత ఇమేజ్ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రజల మధ్యకు వెళ్తూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపేవారు. దీంతో ఒక్కసారిగా వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి అనేలా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రాచుర్యం పొందారు. అయితే ఎన్నికల్లో నాలుగో సారి ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ప్రజలకు అన్నీ చేస్తే తనకు ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోలేక పోయారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి గత ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిన వైఫల్యాలను బయట పెడుతున్నారు. దీంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం ప్రారంభం అయింది.
* పట్టున్న నాయకుడు
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కూటమి ప్రభంజనంలో బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్( Satya Kumar Yadav) అతి తక్కువ మెజారిటీతో మాత్రమే గెలవగలిగారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో కేతిరెడ్డి సేవలను అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటారు. అటువంటి నేత ఇప్పుడు జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. అటు వైసిపి పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం.. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో జనసేన నాయకత్వం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని విడిచి పెట్టనని చాలా సందర్భాల్లో వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.