Jagan: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) వైఖరి మారడం లేదు. ఆయన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ప్రజలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. తన ప్రజలు తనకు ఉన్నారని భావిస్తున్నారు. తన ఓట్లు ఎటు వెళ్ళవని ఆయన నమ్మకంగా ఉన్నారు. దానిని నమ్ముకుని ఆయన ఇంకా గుణ పాఠాలు నేర్చుకోవడం లేదు. దాని పర్యవసానాలు ఏదో రోజు ఆయన చవిచూడక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారు. ఒకసారి బలమైన ప్రతిపక్ష హోదాను పొందారు. రెండోసారి భారీ విజయం సాధించారు. మూడోసారి దానికంటే దారుణ పరాజయం చూశారు. అయితే తాను ఓడిపోలేదని.. తనకు 40% ఓటు బ్యాంకు దక్కిందని.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తనకు ఆయుధం ఇవ్వండి.. యుద్ధం చేస్తాను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. కానీ ఆయుధం వినియోగించే సామర్థ్యం ఆయన సాధించలేదు. అందుకే తాము ప్రతిపక్షం ఇవ్వలేమని అధికారపక్షం తేల్చేస్తోంది.
Also Read: అడుగు బురదలో పవన్.. వీడియోలు వైరల్!
* 40% ఓట్లు ఉన్నాయని చెప్పారుగా..
40% ఓటు బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్న. తుఫాన్ బాధితుల్లో ఆ 40 శాతం మంది ప్రజల్లో కొంతమంది ఉంటారు కదా? వారిని పరామర్శించాలి కదా? కానీ కనీస ప్రయత్నం చేయలేదు. బెంగళూరు( Bengaluru ) నుంచి విమాన సర్వీసులు రద్దయ్యా యి అని చెప్పి అక్కడే ఉండిపోయారు. పోనీ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పంట నష్టాన్ని, తుఫాన్ బాధితులను సందర్శించిన దాఖలాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసి పార్టీ శ్రేణులే ఆందోళనతో ఉన్నాయి.
* పిలుపునిస్తారు కానీ పాల్గొనరు..
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏదైనా ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడమే కానీ.. తాను పాల్గొనడం చాలా అరుదు. ఇప్పుడు కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం వైసిపి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విమానం రద్దయిందని చెప్పి బెంగళూరు ప్యాలెస్ కు పరిమితం అయ్యారు. ఎలాగోలా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం లేదు. తుఫాన్ బాధితులను కలవడం లేదు. చంద్రబాబు వెళ్లి వచ్చారు. పవన్ కళ్యాణ్ పొలాల్లో ఉన్న బురదలో దిగి మరి పంటలను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణులతో పని చేయించి.. మైలేజ్ తాను దక్కించుకోవాలని చూస్తున్నారు. దానిని చూసిన వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.