Voluntary System : ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు.అదిగో ఇదిగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి ప్రకటించడం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా?కొనసాగిస్తారా? లేకుంటే తొలగిస్తారా? అన్నది తెలియడం లేదు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. జీతం సైతం పదివేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అస్సలు ఫోకస్ పెట్టలేదు. అసలు వాలంటీర్లను ఏం చేస్తాం అన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావనతో.. ఒక మంత్రి శాఖకు సంబంధించి వాలంటీర్లు అని పేరు పెట్టారు. అంతకుమించి ఏమీ చేయలేదు. దీంతో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి.అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని లక్షన్నరమంది వాలంటీర్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని టాక్ నడుస్తోంది.అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ వాలంటీర్లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ఛాన్స్ ఇచ్చారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను అందించే బాధ్యతను వారికి అప్పగించారు. వైసిపి నేతలకంటే ఎంతో ప్రాధాన్యమిచ్చారు వాలంటీర్లకు. దీనిపై ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వచ్చినా జగన్ వినలేదు. ఐదేళ్లపాటు వీరిని కొనసాగించారు. ఉద్యోగులకు జీతాలు లేటయినా..పె న్షనర్లకు పింఛన్లు ఆలస్యమైనా… వాలంటీర్లకు మాత్రం సక్రమంగా జీతాలు చెల్లిస్తూ వచ్చారు.
* వైసీపీ తరఫున జీతాలు?
అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నేతల మాట విని చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అనవసరంగా వైసీపీ నేతల మాట విని రాజీనామా చేశామని వారు బాధపడుతున్నారు. కొందరైతే పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో సైతం ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో జగన్ కొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు వైసీపీ తరఫున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు సిద్ధపడినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఐదేళ్లపాటు వీరికి జీతాలు ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం. వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించి వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించిన జగన్.. ఇప్పుడు అదే వలంటీర్లకు జీతాలు ఇస్తారంటే ఎవరికి నమ్మశక్యం కావడం లేదు. మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.