Jagan Vs Ramoji Rao: తినడానికి తిండి లేదు కానీ..మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది వైసిపి సర్కార్ తీరు . మార్గదర్శి కేసు విషయంలో జగన్ సర్కార్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. జగన్కు రామోజీరావుకు మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన అంశం. అయితే రామోజీరావు పై రివెంజ్ కు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుండడం అభ్యంతరకరం.
మార్గదర్శిపై ఫిర్యాదు చేసేందుకు ఏ ఖాతాదారుడు ముందుకు రావడం లేదు. ఇది జగన్ సర్కార్ కు ప్రెస్టేజ్ ఇష్యూ గా మారింది. అందుకే ఆదివారం పూట సాక్షితో పాటు తన కూలి మీడియాకు మార్గదర్శి చందాదారులకు నోటీసు పేరిట భారీ యాడ్లు ఇచ్చారు. ఇందుకుగాను రామారామి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థను ఏదేదో చేద్దామని.. ఇటువంటి చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాధనాన్ని ఆ సంస్థ కోసం ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం కోసం వెచ్చించడం ఎంతవరకు సముచితం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వాస్తవానికి మార్గదర్శిలో మూసేయాలనుకుంటున్న చిట్స్.. యాడ్లు రూపంలో ఇచ్చిన మొత్తం అంతా కూడా కావు. మరి ఎవరి సొమ్ము అని అంత ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇచ్చారో జగన్ కి ఎరుక. 10 కోట్లతో యాడ్లు ఇచ్చిన రిజిస్ట్రేషన్ శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వసతులకు ఖర్చుపెట్టి ఉంటే చాలా బాగుండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మార్గదర్శిని యాజమాన్యాన్ని ఏమి చేయలేకపోతున్నామన్న అసహనం ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారు. మొన్నటి వరకు జగన్ సర్కారు మార్గదర్శి కేసు విషయంలో వ్యవహరించిన తీరు ఒకలా ఉంది. ఎప్పుడైతే పత్రికలకు భారీ యాడ్ల రూపంలో ప్రకటన ఇచ్చారో పక్కదారి పట్టింది. ప్రజలు కూడా మార్గదర్శి యాజమాన్యం పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఒక స్థిర నిర్ణయానికి వస్తున్నారు. పోనీ ఇంత చేస్తున్నా మార్గదర్శి చందాదారులు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడానికి హైరానా పడడం లేదు. ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉందంటే..రాను రాను మార్గదర్శి ఎంత బలంగా ఉందో ప్రజలకు నిరూపిస్తున్నట్టుగా ఉంది.