YS Jaganmohan Reddy  : వైసీపీ నేతల జైలు పరామర్శలు .. వరద బాధితులపై నో ఇంట్రెస్ట్.. జగన్ పై గుస్సా!

విజయవాడను వరదలు ముంచేశాయి. కనీవినీ ఎరుగని నష్టం కలిగింది. ఈ తరుణంలో బాధితులకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత.. ఆశించిన స్థాయిలో స్పందించలేదు. బాధితులకు అండగా నిలవలేదు. కానీ జైల్లో ఉన్న వైసీపీ నేతల పరామర్శలకు వెళ్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Written By: Dharma, Updated On : September 11, 2024 10:39 am

YS Jaganmohan Reddy 

Follow us on

YS Jaganmohan Reddy : వైసీపీ అధినేత జగన్ తీరు మారడం లేదు. అధికారాన్ని దూరం చేశారని కోపమో.. ఏంటో తెలియదు కానీ ప్రజలను కలిసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ప్రజలు అల్లాడుతున్నారు. ఎనిమిది రోజులు అవుతున్న వరద బీభత్సం తగ్గడం లేదు. ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పునరావాస శిబిరాల్లో ఇంకా ప్రజలు ఉన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షించారు. నిరంతరం బాధితులను పరామర్శిస్తూ వచ్చారు. అయితే అంతకుమించి ప్రతిపక్ష నేతగా జగన్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన తూతూ మంత్రపు పరామర్శలకు పరిమితం అయ్యారు. వరద బాధితుల పరామర్శకు వచ్చి రాజకీయ విమర్శలతో సరిపెట్టారు. వైసీపీ శ్రేణులు సైతం సహాయ చర్యల్లో పాల్గొనలేదు. వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ వైసీపీ పరిధిలో ఉంది. మేయర్ తో పాటు కార్పొరేటర్లు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అధికారం చలాయిస్తున్నారు. అయినా సరే బాధితులను పట్టించుకునే తీరిక, ఓపిక వైసిపి నేతలకు లేకుండా పోయింది. దీనిపై విమర్శలు చుట్టుముడుతున్నాయి.

* ఎక్కువ సమయం వారికే
అయితే జగన్ వైసీపీ శ్రేణులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈరోజు ఆయన గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించనున్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనను అరెస్టు చేశారు. అయితే అది అక్రమంగా అరెస్ట్ అని వైసిపి ఆరోపిస్తోంది. టిడిపి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు దిగుతోందని చెబుతోంది. అందుకే జైల్లో ఉన్న నందిగామ సురేష్ ను పరామర్శించేందుకు జగన్ రంగంలోకి దిగారు.

* నాడు పిన్నెల్లికి పరామర్శ
ఎన్నికల పోలింగ్ సమయంలో విధ్వంసం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనను నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ సమయంలో కూడా జగన్ ప్రత్యేకంగా నెల్లూరు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు అత్యంత ఇష్టుడైన బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు ఏకంగా గుంటూరు జైలుకు వెళ్తున్నారు. గత రెండు రోజులుగా సురేష్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ పరామర్శకు వెళ్తున్నట్లు వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

* విజయవాడ కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉన్నా
వైసీపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం.. జగన్ వరద బాధితులకు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎనిమిది రోజులుగా విజయవాడ నగరం కంటిమీద కునుకు లేకుండా గడిపింది. ఇప్పటికీ భయం వెంటాడుతూనే ఉంది. ప్రతిపక్షనేతగా బాధితులను పరామర్శించి భరోసా కల్పించాల్సింది పోయి.. తూతూ మంత్రంగా 2 సార్లు పరామర్శించి.. రాజకీయ విమర్శలు చేసి మౌనంగా ఊరుకున్నారు జగన్. పార్టీ తరపున సాయం కూడా ప్రకటించలేదు. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. విజయవాడ కార్పొరేషన్ పరంగా ఎటువంటి సాయం కూడా అందించలేకపోయారు. దీంతో జగన్ తీరుపై ముప్పేట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.