TDP MLA,s : ఏపీలో కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. 164 సీట్లలో విజయాన్ని కట్టబెట్టారు. దీంతో చంద్రబాబు సైతం ప్రజల ఆకాంక్షలను గుర్తించారు. వైసిపి హయాంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అందుకే టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మధ్య చులకన కాకుండా చూసుకోవాలని హితబోధ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలకు సైతం దిశా నిర్దేశం చేశారు. చిన్న తప్పిదం జరిగినా ఫోకస్ చేసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, విపక్ష వైసిపి ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. వైసీపీ నేతలు చేసిన పని, దూకుడుగా ముందుకు వెళ్లడం వంటి చర్యలను తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కట్టు దాటుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అవుతుండడం పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆదిమూలం పై వేటు పడింది. లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు.
* అప్పట్లో అతి చేసిన ఆమె
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి భార్య పోలీసులపై రుబాబు చేశారు. తన భర్తకు ఇచ్చే ప్రోటోకాల్.. తనకు ఇవ్వాలని.. పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని గట్టిగానే వాదనకు దిగారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి వచ్చింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సదరు మంత్రికి చంద్రబాబు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.
* ఆ యువ ఎమ్మెల్యే పై
ఉమ్మడి తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పై సైతం సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురైనట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఏకంగా ఆయన మీడియాను బెదిరించడం.. అదికూడా టిడిపి అస్మదీయ మీడియా కావడం హాట్ టాపిక్ గా మారింది. తన నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే సదరు విలేఖరికి బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగానే హెచ్చరికలు పంపారు. ఇదే విషయంపై ఈనాడు ప్రధాన సంచికలో పతాక శీర్షిక వార్త వచ్చింది. దీనిపై చంద్రబాబు సైతం కలుగజేసుకుని ఎమ్మెల్యేకి క్లాస్ పీకినట్లు టాక్ నడిచింది.
* తాజాగా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేతో
అయితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వ్యవహార శైలి సైతం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో వైసీపీ నేత ఇంటిని కూల్చివేయడం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ సమయంలో సైతం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా కొంతమంది డ్వాక్రా మహిళల విషయంలో ఆయన వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది. వైసిపి దీనినే హైలెట్ చేస్తోంది. రాష్ట్రస్థాయిలో ప్రచారాస్త్రంగా మారుతోంది. ఈ ఎమ్మెల్యేకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. అమరావతి ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అది నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారన్న విమర్శ ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారుతుండడం విశేషం.