Jagan Vs Chandrababu : ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు చిరునామాగా ఏపీ మారుతోంది. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పరిస్థితి మారింది. అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం పరిపాటిగా ఉండేది. దానికి బ్రేక్ వేశారు సీఎం స్టాలిన్. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కువవుతోంది. అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నెలలపాటు జైల్లో ఉండి పోయారు. అయితే తన అరెస్ట్ కు చంద్రబాబు కారణమని భావించిన జగన్మోహన్ రెడ్డి.. అదే చంద్రబాబును అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు చేయించారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అదే ప్రభావం చూపిందన్నది ఒక విశ్లేషణ. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది.
* తదుపరి అరెస్ట్ జగన్ దే..
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణం తో( liquor scam) పాటు ఇతర కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. అయితే మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసుల్లో కీలక నేతలు, అప్పటి సీఎం ఓ అధికారులు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని అంతటా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో భిన్న కామెంట్స్ వ్యక్తం చేశారు. జగన్ అరెస్టు వీలు కాదని అర్థం వచ్చేలా మాట్లాడారు.
Also Read : రౌడీ షీటర్లు హత్య నిందితుల పరామర్శ కోసం తెనాలికి జగన్
* క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర చర్చ..
ఏపీ క్యాబినెట్( AP cabinet) సమావేశం నిన్ననే జరిగిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో క్యాబినెట్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలను చర్చించి ఆమోదం పొందారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై చర్చించారు. ఈ క్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. జగన్ అరెస్ట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తనను అరెస్టు చేసినందున.. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేద్దామంటే ఎలా అని ప్రశ్నించారు. సరైన ఆధారాలు, రుజువులు లేకుండా అరెస్ట్ జరగదని అర్థం వచ్చేలా మాట్లాడారు. నిందితులు, నేరచరితు ల తో రాజకీయంగా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. తద్వారా ప్రతీకార రాజకీయాలు లేవని సంకేతాలు ఇచ్చారు.
* భిన్న కామెంట్స్
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అరెస్టు కావాలని సగటు టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇదే విషయంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని.. ఈ విషయంలో తొందరపాటు వద్దని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. అదే సమయంలో ప్రతీకార రాజకీయాలు ఉండవని సంకేతాలు ఇవ్వగలిగారు. మొత్తానికి అయితే జగన్ అరెస్ట్ ఉండదని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడడం విశేషం. దీనిపై టిడిపి శ్రేణుల్లో భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.