https://oktelugu.com/

YS Jagan : అధికారం పోవడంతో.. సాక్షి విలువను తగ్గించేస్తున్న జగన్

ప్రస్తుతం ఏపీలో సాక్షి సర్కులేషన్ 4 లక్షలు గా ఉందని తెలుస్తోంది.. జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత క్రమేపి సాక్షి సర్కులేషన్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పడిపోతున్న సర్కులేషన్ పెంచుకునేందుకు సాక్షి యాజమాన్యం సరికొత్త ప్రణాళికకు తెర లేపింది. గతంలో మాదిరి రెండు రూపాయలకే పత్రికను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 5, 2024 / 01:08 PM IST

    Sakshi News Paper

    Follow us on

    YS Jagan :  : సరిగ్గా అంటే 2008 లో రంగుల పేజీలు.. ఇంద్రధనస్సు మీ చేతిలో అంటూ సాక్షి పత్రిక పుట్టుకొచ్చింది. రెండు రూపాయలకే పత్రిక ఇచ్చి.. రంగు రంగుల పేజీలను ప్రచురించింది. అంతేకాదు పోటీ పత్రికలను కూడా ఇదే ధరకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పట్లో సాక్షి కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఉండేది. కాలం మారింది.. రాజశేఖర్ రెడ్డి అస్తమయం అయిన తర్వాత.. సాక్షి కూడా తన గొంతును మార్చుకుంది. కాంగ్రెస్ కు వ్యతిరేక స్వరం వినిపించడం మొదలుపెట్టింది.

    2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకు ఏపీలో ఎదురనేదే లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రకటనలతో రోజు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కనిపించేది. జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పథకానికి సంబంధించిన ప్రకటన సాక్షికి వచ్చేది. ఎలాగో సాక్షి జగన్ సొంత పత్రిక కాబట్టి.. అడ్డగోలుగా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. ఐదు సంవత్సరాలపాటు సాక్షికి వందల కోట్ల ప్రభుత్వ ధనం ప్రకటనల రూపంలో వచ్చింది. అప్పట్లో ఏపీలోని ప్రతి కార్యాలయంలో సాక్షి పత్రికలు వేయించుకునేవారు. వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సాక్షి పత్రికను కొనుగోలు చేసేవారు. ఫలితంగా అప్పట్లో సాక్షి పత్రిక సర్కులేషన్ పెరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయంపై ఈనాడు కోర్టుకు వెళ్లడంతో.. అప్పట్లో కోర్టు సాక్షికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఇక ఈలోగా అధికారం పోవడంతో సాక్షి పత్రికకు బ్యాడ్ టైం ప్రారంభమైంది.

    పడిపోవడం ప్రారంభమైంది

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడుకు దరిదాపుల్లో ఉన్న సాక్షి సర్కులేషన్.. ప్రస్తుతం పడిపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏపీలో ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు వచ్చే అవకాశం లేకపోవడంతో సాక్షికి ప్రైవేట్ యాడ్స్ దిక్కు. సర్కులేషన్ ఉంటేనే ప్రైవేట్ యాడ్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో తన సర్కులేషన్ పెంచుకునేందుకు సాక్షి రకరకాల కసరత్తులు చేస్తోంది. కాంప్లిమెంటరీ కాపీల పేరుతో ప్రజలకు ఉచితంగానే పత్రికను పంపిణీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సంవత్సర చందా 1250 రూపాయలు మాత్రమే అంటూ ఆఫర్ ప్రకటిస్తోంది. గతంలో సంవత్సర చందాతో పాటు కుక్కర్ లేదా ఇంటి సామాను ఉచితంగా ఇచ్చేవారు. సంవత్సర చందాలో సగం ఆ సమాను కు ఖర్చుకాగా.. మిగతా సగం పేపర్ ఖర్చుగా స్వీకరించేవారు..

    సర్కులేషన్ 4 లక్షలు మాత్రమే

    ప్రస్తుతం ఏపీలో సాక్షి సర్కులేషన్ 4 లక్షలు గా ఉందని తెలుస్తోంది.. జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత క్రమేపి సాక్షి సర్కులేషన్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పడిపోతున్న సర్కులేషన్ పెంచుకునేందుకు సాక్షి యాజమాన్యం సరికొత్త ప్రణాళికకు తెర లేపింది. గతంలో మాదిరి రెండు రూపాయలకే పత్రికను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పత్రిక నిర్వహణ భారం తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో సాక్షి యాజమాన్యం ఈ ఖర్చును ఎంతవరకు భరిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. గతంలో రెండు రూపాయలకే సాక్షి పత్రికను అమ్మిన ఆ యాజమాన్యం.. ఆ ధరకే మిగతా యాజమాన్యాలు కూడా పేపర్ అమ్మాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఆ డిమాండ్ ను కాస్త పక్కన పెట్టి.. తను కూడా ఆరు రూపాయలకు అమ్మడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్లీ రెండు రూపాయల పల్లవి అందుకుంది.. మరి ఇది ఎంతవరకు సాక్షిని నిలబెడుతుందనేది వేచి చూడాల్సి ఉంది.