Rythu Runa Mafi: ఏపీలో విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. వచ్చేవారం ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరుతుందని ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల ఎన్నికల వ్యూహాలు సంయుక్తంగా ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో జగన్ అలర్ట్ అయ్యారు. తన వ్యూహాలను పదును పెడుతున్నారు. సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సిద్ధం సభలు పూర్తయ్యాయి. ఆదివారం రాప్తాడులో సభ జరగనుంది. ఇదే వేదికపై జగన్ కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది.
రాప్తాడు సభలో ఎన్నికల మ్యానిఫెస్టో జగన్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. 2019 ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు. అందులో మెజారిటీ హామీలను అమలు చేసినట్లు నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ఈసారి మరింత మెరుగైన మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూడాలని చూస్తున్నారు. చాలా రోజులుగా కీలక వరాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా రుణమాఫీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నారు. 2014లో తన ఓటమికి రుణమాఫీ ప్రకటన లేకపోవడమే కారణమని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి రుణమాఫీ ప్రకటించి ప్రజల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించారు. అభివృద్ధి లేదన్న అపవాదును మాత్రం మూటగట్టుకున్నారు. అయితే దానిని సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అధిగమించాలని చూస్తున్నారు. అందుకే రుణమాఫీ ప్రకటన చేసి రైతులు, డ్వాక్రా మహిళల అభిమానాన్ని సురగుణాలని భావిస్తున్నారు. వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది రైతులకు ప్రయోజనం అందుతుంది. ఇప్పుడు గానీ రుణమాఫీ అందిస్తే విజయాన్ని సునాయాసంగా దక్కించుకోవచ్చని జగన్ చూస్తున్నారు. దీంతో రాప్తాడు సిద్ధం సభ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.