YS Jagan : జగన్ డిఫెన్స్ లో పడ్డారు. ఒకే సమయంలో రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూటు మార్చారు జగన్. ఇన్నాళ్లు బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం నడిపారు. అయితే ఇప్పుడు పులివెందులకు మార్పు చేశారు. అక్కడ నుంచి రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. షర్మిల తో వివాదానికి ముగింపు పలికేలా అడుగులు వేస్తున్నారు. దీంతో జగన్ అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత జగన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి జగన్ ను టార్గెట్ చేస్తోంది. షర్మిల తో వివాదం, తల్లి విజయమ్మ వైఖరితో ఆత్మరక్షణలో పడ్డారు జగన్. అదే సమయంలో కుటుంబం సైతం దూరమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటి సమస్యలను పరిష్కరించుకోవాలని జగన్ తాజాగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులకు కీలక చర్చలు జరుపుతున్నారు. వరుస మంతనాలు చేస్తున్నారు. ఎన్ని రోజులు బెంగళూరు కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు వరుసగా పులివెందులలో కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లడం విశేషం.
* నాలుగు రోజులుగా పులివెందులలో
జగన్ నాలుగు రోజుల పర్యటనకు పులివెందుల వెళ్లారు. తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో చాలాసేపు చర్చలు జరిపారు. షర్మిల తో ఉన్న వివాదం పైనే ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అటు తరువాత పెదనాన్న ప్రకాశ్ రెడ్డి ఇంటికి సైతం వెళ్లారు. అక్కడ ఏకాంతంగా ఆయనతో చర్చలు జరిపారు. విజయమ్మతో రాయబారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సమీప బంధువులు ఇద్దరి ఇంటికి సైతం జగన్ వెళ్ళినట్లు సమాచారం. దీంతో కుటుంబంలో నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆందోళనకు అదే కారణం
చెల్లెలు షర్మిల వైపే తల్లి విజయమ్మ ఉంటానని తేల్చి చెప్పడం జగన్లో ఒక కలవరపాటుకు కారణంగా తెలుస్తోంది. అందుకే తాజాగా ఢిల్లీలో కీలక నేతలతో జగన్ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి నష్టం చేకూరుస్తున్నారని జగన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. అందుకే ముందుగా ఈ ఆస్తులు, విభేదాలకు ముగింపు పలికే విధంగా కుటుంబంలోని పెద్దలతో చర్చలు చేస్తున్నారని సమాచారం. జనవరి నుంచి పూర్తిగా ప్రజల్లో ఉండాలని జగన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ నియామకాలపై దృష్టి పెట్టారు. ప్రతి జిల్లాలోని జగన్ పర్యటన ఉంటుందని నేతలు చెబుతున్నారు. అంతకుముందే కుటుంబ వివాదాలు చక్కబెట్టుకోవాలని జగన్ చూస్తున్నారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.