TTD Trust Board : ఉత్తరాంధ్రకు మరోసారి అన్యాయం జరిగింది. టీటీడీ ట్రస్ట్ బోర్డులో ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం దక్కలేదు. బి.ఆర్ నాయుడు అధ్యక్షుడిగా నియామకం అయిన సంగతి తెలిసిందే. మరో 24 మంది సభ్యులను నియమించారు. తెలంగాణకు సైతం చోటిచ్చారు. బిజెపి అగ్ర నేతల సిఫార్సులకు సైతం ప్రాధాన్యమిచ్చారు. జనసేన కోట కింద ముగ్గురుకు పదవులు ఇచ్చారు. అన్ని రంగాల వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర కిచోటు దక్కకపోవడం నేతల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ పదవి పై రకరకాల ప్రచారం నడిచింది. మెగా బ్రదర్ నాగబాబు పేరు తెరపైకి వచ్చిన ఆయన విముఖత చూపారు. దీంతో అశోక్ గజపతి రాజుకు ఆ స్థానం దక్కుతుందని అంతా భావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. దీంతో టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆయనకు సైతం అవకాశం ఇవ్వలేదు. పోనీ కళా వెంకట్రావుకి ఇస్తారని కూడా ప్రచారం నడిచింది. బీసీ వర్గానికి చెందిన నేతగా మంత్రి పదవి ఆశించారు కళా వెంకట్రావు. క్యాబినెట్లో చోటు దక్కకపోయేసరికి నామినేటెడ్ పోస్ట్ కట్ట పెడతారని టాక్ నడిచింది. టిటిడి చైర్మన్ పోస్ట్ ఇస్తారని తెగ ప్రచారం నడిచింది. ఆయనకు సైతం చోటు దక్కలేదు.
* గతంలో ప్రాతినిధ్యం
టీటీడీ సభ్యులుగా ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం విశేషం. గతంలో టీటీడీ బోర్డులో ఉత్తరాంధ్ర నుంచి తీసుకునేవారు. ఈసారి మంత్రి పదవి దక్కని వారికి టీటీడీ బోర్డులోకి తీసుకుంటారని ఒక ప్రచారం అయితే నడిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి దక్కక పోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. ఆయనకు టీటీడీ బోర్డు పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ అది కూడా జరగలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు శ్యామసుందర శివాజీకి టీటీడీ బోర్డు సభ్యుడిగా అప్పట్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెకు ఆ ఛాన్స్ ఇస్తారని తెగ ప్రచారం నడిచింది. కానీ మొండి చేయి మిగిలింది.
* విజయనగరానికి మొండిచేయి
విజయనగరం నుంచి కళా వెంకట్రావు ఏకంగా అధ్యక్ష పదవిని ఆశించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే ఆయన ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. బొత్స సత్యనారాయణ పై గెలిచారు. దీంతో ఆయనకు క్యాబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని ప్రచారం నడిచింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు పదవి సైతం దక్కలేదు. గతంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి సభ్యురాలిగా నియమించారు. ఈసారి మాత్రం మొండి చేయి చూపారు.
* విశాఖకు నో ఛాన్స్
ఉమ్మడి విశాఖ జిల్లాకు సైతం కనీస స్థాయిలో కూడా ప్రాతినిధ్యం లేదు. గతంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం ఇచ్చారు. ఈసారి ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. గతంలో వంగలపూడి అనిత సైతం సభ్యురాలిగా సేవలందించారు. ఈసారి ఆమె హోం మంత్రిగా ఉన్నారు. కానీ ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. కనీసం ఇతరులకు సైతం చాన్స్ ఇవ్వలేదు. ఉత్తరాంధ్రకు మొండి చేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ట్రస్ట్ బోర్డు పదవీకాలం రెండేళ్లు కావడంతో.. వచ్చే కార్యవర్గంలో చాన్స్ ఇస్తారో? లేదో? చూడాలి.