Jagan Vs TDP: తెలుగుదేశం పడి లేచిన పార్టీ. పడిపోయిన ప్రతిసారి అంతే వేగంతో లేస్తూ వచ్చింది. అయితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని చాలా తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబును దారుణంగా దెబ్బతీశానని భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చారు చంద్రబాబు. పడిన చోటే నిలబడ్డారు. పవన్ కళ్యాణ్, బిజెపితో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీశారు. అయితే కూటమి దూకుడుతో ఇప్పుడు జగన్ బెంబేలెత్తిపోతున్నారు. తెలుగుదేశం కూటమిని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు. అలా అని పాత వ్యూహాలు ఏపీలో పనిచేయడం లేదు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మదిలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కష్టం నుంచి గట్టెక్కించగలరని ఆయన బలంగా భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* జూనియర్ ఎన్టీఆర్ అనుచరులుగా..
తెలుగుదేశం ( Telugu Desam)పార్టీలో ఉండి ఎన్టీఆర్కు అవమానం జరిగిందని బయటకు వచ్చారు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి పరిస్థితి నానాటికీ దిగజారింది. లోకేష్ వల్ల కాదు. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి రప్పించి పగ్గాలు అందించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. చాలామంది సీనియర్లు ఈ వ్యాఖ్యానాలు కూడా చేశారు. అయితే వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు, లోకేష్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ అవతరిస్తున్నారు. పార్టీ సైతం ఆయన చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. ఇక ఏపీలో పట్టాభిషేకమే తరువాయి అన్నట్టు పరిస్థితి మారింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన సపోర్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు పుష్కలంగా ఉంది. టిడిపిని కట్టడి చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి కష్టంగా మారింది.
* ఆ సమయంలో నోరు తెరవని తారక్..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. వైసిపి హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ కి అవమానం జరిగింది. చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచేశారు. ఆ సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరవలేదు. తెలుగుదేశం పార్టీకి కానీ.. చంద్రబాబు కుటుంబానికి కానీ అండగా నిలవలేదు. పైగా అప్పట్లో కొడాలి నానితో పాటు వల్లభ నేని వంశీ మోహన్ ను కట్టడి చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక అంచనాకు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేశారని అనుమానించిన వారు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కడా రాజకీయ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు.
* అనంతపురం జిల్లా పరిణామాలతో..
అయితే మొన్న అనంతపురం( Ananthapuram district ) జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒక వివాదం జరిగిన సంగతి తెలిసిందే. టిడిపి ఎమ్మెల్యే ఒకరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అయితే ఆ వివాదాన్ని పెద్దదిగా చేయడం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని కామెంట్స్ వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ను మరోసారి తెరపైకి తెచ్చి.. టిడిపిలో చీలిక తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినట్లు అనుమానాలు ఉన్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ను టిడిపిలో యాక్టివ్ చేసి.. చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించే టిడిపి నేతలతో పార్టీని అడ్డగోలుగా చీల్చాలని జగన్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. పొలిటికల్ సర్కిల్లో కూడా ఇది ప్రచారం నడిచింది. అయితే దానికి ధ్రువీకరిస్తూ ఎటువంటి ఆధారాలు లేవు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.