Jagan now alone: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చుట్టూ నిత్యం ఆ నలుగురు ఉండేవారు. విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇటీవల ఎన్నికలకు ముందు ఆ టీంలో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక అధికారులపరంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా వైసీపీ నేత కంటే ఎక్కువగా వ్యవహరించారు ధనుంజయ రెడ్డి. ఆయన సీనియర్ ఐఏఎస్. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగా ఉండేవారు కృష్ణమోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న ఈ కోటరీ అంతా ఖాళీ అయింది. మద్యం కుంభకోణం కేసులో ఎక్కువమంది అరెస్టయ్యారు. ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆపై జగన్ చుట్టూ కూడా అనుమానపు చూపులు ప్రారంభం అయ్యాయి. ఆయన అరెస్టు సైతం ఉంటుందన్నది ప్రచారం జరుగుతోంది.
ఒక్కొక్కరు దూరం..
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ నలుగురు పవర్ఫుల్ అనేది బహిరంగ రహస్యం. అయితే కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). అది అధినేత జగన్మోహన్ రెడ్డి కి కోలుకోలేని దెబ్బ. అయితే మద్యం కుంభకోణం కేసు తెరపైకి వచ్చిన తరువాత తన కోటరీ లో ఉన్న ఒక్కొక్కరు కేసుల్లో చిక్కుకున్నారు. అరెస్టులకు గురయ్యారు. ముందుగా అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్కు వ్యాపార సన్నిహితుడు గోవిందప్ప బాలాజీ సైతం ఈ కేసులో చిక్కుకున్నారు. ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి సైతం రిమాండ్ ఖైదీగా మారిపోయారు. ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అటవీ భూముల కేసు మెడకు చుట్టుకుంది. దీంతో జగన్ వద్దకు రావాలంటే కీలక నేతలకు భయం వెంటాడుతోంది.
Also Read: ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన జగన్!
పెద్దగా స్పందించని వైసీపీ నేతలు..
అయితే మద్యం కుంభకోణం( liquor scam) కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నా వైసిపి నుంచి పెద్దగా సౌండ్ రావడం లేదు. మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు మాట్లాడడం లేదు. అసలు సీనియర్లు నోరు తెరవడం లేదు. దీంతో ప్రజల్లోకి మద్యం కుంభకోణం అంశం వెళ్తోంది. పార్టీకి అంతిమంగా డామేజ్ జరుగుతోంది అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న అరెస్టుల విషయంలో ఎవరూ మాట్లాడడం లేదు. అక్రమ అరెస్టులంటూ ఎవరూ నిరసన బాట పెట్టడం లేదు. ఇది ఇబ్బందికరమే అని పార్టీలో చర్చ జరుగుతోంది. చాలామంది సీనియర్లు మౌనంగా ఉన్నారు. కనీసం పార్టీ విధానాలపై మాట్లాడడం లేదు. అరెస్టులతో క్లిష్ట సమయంలో ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మాట్లాడేందుకు సాహసించడం లేదు.
కూటమి వ్యూహాత్మక అడుగులు
జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి(alliance) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అరెస్టులు కొనసాగిస్తూనే.. వారు కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందేలా స్వేచ్ఛ ఇస్తున్నారు. అదే సమయంలో పక్కా ఆధారాలతో అరెస్టులు చేసినట్లు చూపుతున్నారు. దీంతో వారికి బెయిల్ లభించడం లేదు. మద్యం కుంభకోణం కేసులో సిట్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితుల ప్రమేయాన్ని నిర్ధారిస్తూ ఆధారాలను సేకరించి పెట్టుకుంది సిట్. మరోవైపు దేశంలోనే ఇది భారీ కుంభకోణం అని ప్రాజెక్ట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నేతలను అరెస్టు చేసి బలహీనం చేస్తోంది. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా చేస్తున్న ఈ ప్రయత్నాలు సఫలం అయినట్టే కనిపిస్తున్నాయి.