Jagan: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీదే విజయం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలలో చాలా రకాల లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో ఉండడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు ఆయన ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి కి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రారంభంలో వారంలో నాలుగు రోజులు పాటు తాడేపల్లిలో ఉండేవారు. అయితే అది క్రమేపి రెండు రోజులకు పడిపోయింది. ఒక్కోసారి తాడేపల్లి కి కనిపించకుండా కూడా మానేశారు. అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ శిబిరం చంద్రబాబుపై తరచూ ఒక ఆరోపణ చేసేది. చంద్రబాబుతో పాటు లోకేష్ హైదరాబాదులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించేవారు. ఇప్పుడు అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అయితే టిడిపి కూటమి నేతలు ప్రశ్నించడం లేదు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే దీనిపై ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
* ఈవారం గైర్హాజరు..
వారం రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్( digital book) ప్రారంభించారు. ఎక్కడైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూటమి నుంచి ఇబ్బందులు ఎదురైతే.. డిజిటల్ బుక్ లో వివరాలు నమోదు చేసుకోవాలని.. అధికారంలోకి వస్తే వారందరినీ సప్త సముద్రాలు అవతల ఉన్న తెచ్చి చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అయితే ఆ డిజిటల్ బుక్ ను తెరిచి పార్టీ కార్యకర్తలకు చూపించి బెంగళూరు వెళ్ళిపోయారు. తరువాత ఆ డిజిటల్ బుక్ వ్యవహారం అనేది ఏంటి? ఎలా తీసుకెళ్లాలి? అనేది మాత్రం వివరించే ప్రయత్నం చేయలేదు. అసలు ఈ వారం బెంగళూరు నుంచి తాడేపల్లి కి రాలేదు. అటు నుంచి అటే యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు జగన్మోహన్ రెడ్డి దంపతులు. అంటే మరో నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండరన్నమాట.
* అధికారంలో ఉన్నప్పుడు..
అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి( Tadepalli ) విడిచి బయటకు వెళ్లేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. బెంగళూరు ముఖం కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు బెంగళూరును పట్టుకొని వేలాడుతున్నారు. అక్కడే ఎలహంక ప్యాలెస్ లో ఎక్కువగా విడిది చేస్తున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల పర్యటన కూడా చేసేవారు కాదు. ప్రతిపక్షంలోకి వచ్చాక చేస్తామని చెప్పారు. కానీ తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. చంద్రబాబును తిట్టడానికి పరిమితం అవుతున్నారు. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను ప్రస్తావించే సాహసం చేయడం లేదు. ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ తరహా ప్రదర్శన, దూకుడుతో కూటమిని అడ్డుకోలేరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.