YS Jagan Latest News: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన్ని వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యాయి. ఇప్పటివరకు ఆ పార్టీ నిలబడడానికి కూడా ఆవర్గాలే కారణం. అయితే ఆ వర్గాల మద్దతును శాశ్వతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అవకాశాలు ఆయన వదులుకుంటున్నారు. కేవలం కొన్ని రాజకీయపరమైన అంశాలపై మాత్రమే ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. సమకాలీన అంశాలపై అస్సలు స్పందించడం లేదు. అయితే జగన్ నోటి నుంచి ఆ మాటలను వినాలనుకుంటున్న ఆ వర్గాలు.. ఆ పరిస్థితి లేకపోయేసరికి అసంతృప్తికి గురవుతున్నాయి. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇబ్బందులు తెచ్చి పెట్టేలా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడే..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలపై స్పందిస్తారన్న విమర్శ ఉంది. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన స్పందించరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల నాడు ఆయన అస్సలు పట్టించుకోరు అన్న ఆరోపణ కూడా ఉంది. అధికారంలో ఉంటే తప్ప ఆ రెండు జాతీయ పర్వదినాలను పట్టించుకోరని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయితే వారు రాజకీయంగా ఆ విమర్శలు చేయవచ్చు కానీ.. ఇటువంటి వాటిని తటస్థులు, విద్యావంతులు, మేధావులు గమనిస్తూ ఉంటారు. తద్వారా ఒక వర్గం ఓటర్లకు దూరం కావడానికి తనకు తానే కారణం అన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించలేకపోతున్నారు. కేవలం సమకాలిన రాజకీయాలపైనే కాదు.. మన సమాజం చుట్టూ ఏం జరుగుతుందో కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డికి ఉంది.
ఆ రెండు ఘటనలపై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు అతిపెద్ద ఓటు బ్యాంకుగా చెప్పాలి. కానీ క్రమేపి వారి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు తప్పుతోంది. ఉత్తరాఖండ్ లో మహమ్మద్ దీపక్ అనే ఒక ముస్లిం వస్త్ర వ్యాపారి.. తన దుకాణానికి బాబా అనే హిందువుల పేరు పెట్టుకోవడంపై కొన్ని మత సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. అతడి ఉపాధిని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేశాయి. దీనిపై గట్టిగానే తిప్పి కొట్టి సక్సెస్ అయ్యారు మహమ్మద్ దీపక్ కుమార్. దీనిపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. దీనిపై కనీసం స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు తెలంగాణ మేడారం జాతరలో కర్నూలు జిల్లాకు చెందిన వలీ దారుణ అవమానానికి గురయ్యాడు. పది రూపాయలకు బన్ విక్రయిస్తుండగా.. అక్కడకు యూట్యూబర్లు వెళ్లారు. ముస్లిం అనే కారణంతో సదరు చిరు వ్యాపారిపై దాడి చేసినంత పని చేశారు. దీనిపై కుల మతాలకు అతీతంగా తెలుగు సమాజం స్పందించింది. మంత్రి నారా లోకేష్ సైతం స్పందించడం అభినందనలు అందుకుంటుంది. జనసేన బాధితుడికి అండగా నిలిచింది. 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలా ముందుకెళ్తే మాత్రం తన సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కూడా అదే.