Homeఆంధ్రప్రదేశ్‌Jagan: బలాన్ని గుర్తించలేక బలహీనం అవుతున్న జగన్!

Jagan: బలాన్ని గుర్తించలేక బలహీనం అవుతున్న జగన్!

Jagan: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తన వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల తుఫాన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి సొంత పార్టీ నేతలకు కూడా అంతు పట్టడం లేదు. ఎందుకంటే ఆయనకు సలహాదారులు ఉన్నారా? ఉంటే ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? అన్నది అనుమానంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అన్నది పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానం. అధికారంలో ఉన్నప్పుడు అన్ని అలా జరిగిపోతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక వ్యూహం ప్రకారం వెళ్ళాలి. ఆ వ్యూహం చంద్రబాబు దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి విఫల ప్రయత్నం గా మారింది. కనీసం తనకు స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారు. వారి ద్వారా తుఫాన్ రాజకీయం నడిపించే మంచి అవకాశం ఆయనకు వచ్చింది. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?

* చివరివరకు పోరాడే తత్వం
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పాలనా దక్షుడు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఆయన శైలి భిన్నంగా ఉంటుంది. చివరివరకు పోరాటం చేయగల సమర్థత ఆయనది. 2019లో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఈ రాష్ట్రానికి వ్యవహరించారు. కానీ నాడు శాసనసభకు హుందాగా వచ్చారు. చిరునవ్వును కొనసాగించారు. మున్ముందు ప్రతిపక్ష పాత్ర పోషించి చూపిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ హుందా ను ప్రదర్శించలేకపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సభకు వచ్చి తడబడ్డారు. తన మదిలో ఉన్న బాధను మాట్లాడకుండానే వ్యక్తపరిచారు. ప్రత్యర్ధులు అవమానించకుండానే అవమానించబడ్డారు. చంద్రబాబుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నది అదే. ఆ మైనస్ తోనే ఇప్పటికీ తనకు ఉన్న ప్లస్సులను మరిచిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి.

* చంద్రబాబుకు మంచి అలవాటు..
చంద్రబాబుకు ఒక మంచి అలవాటు ఉంది. 1995 నుంచి 2003 వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ఎన్నో రకాల విపత్తులు వచ్చాయి. వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రాగానే.. తనకు అందుబాటులో ఉన్న మంత్రులను, అధికారులను రప్పించి ఒక సమీక్ష జరిపేవారు. తుఫాను హెచ్చరికలను జిల్లాల యంత్రాంగానికి పంపించేవారు. అదో అలవాటైన ప్రక్రియగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆరితేరిపోయారు. అధికారంలో ఉంటారు కనుక అధికారులు వచ్చారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు ఇదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ శ్రేణులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించేవారు. తుఫాన్ సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించేవారు.

* స్థానిక సంస్థలంతా వైసీపీ వే..
అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ వైఖరి అయితే కనిపించలేదు. కరోనా( Corona ) కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను ఆదుకున్నారు. కానీ అదే కరోనా సమయంలో పారాసెటమాల్, డోలో 650 వంటి మాత్రలు వాడితే సరిపోతుందని ప్రకటన చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. కోవిడ్ కాలంలో సమీక్షలు జరుపుతున్నట్లు కూడా అనిపించలేదు. ఇప్పుడు తుఫాన్ ఏపీలో ఉంటే బెంగళూరులో ఉండిపోయారు. కనీసం అక్కడ నుంచి పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. 13 ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే. జడ్పిటిసిలు ఆ పార్టీ వారే. ఆపై ఎంపీపీలు కూడా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ లు కూడా ఆ పార్టీ వారే కొనసాగుతున్నారు. ఆపై 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు, 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. కనీసం వీరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉన్న సరిపోయేది. కానీ ఎందుకో తన బలాన్ని అంచనా వేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా అయితే కష్టమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular