Jagan: ముందస్తు ఎన్నికల విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న జగన్

ఓటమి నుంచి బయటపడేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు జగన్ చేస్తున్నది అదే. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఆయన ముందస్తు ఎన్నికలపై తరచూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇలానే ప్రకటనలు చేసి విజయాన్ని అందుకున్నారు.

Written By: Dharma, Updated On : October 18, 2024 9:09 am

YS Jaganmohan Reddy

Follow us on

Jagan: ఏపీలో ముందస్తుగా ఎన్నికలు వస్తాయా? జమిలి ఎన్నికలు నిజమేనా? 2027 ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వం రద్దవుతుందా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? అందులో వాస్తవం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు జమిలి ఎన్నికలకు జై కొట్టారని.. కేంద్రం ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడ్డారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో జగన్ సైతం పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నియామకం చేపట్టారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని.. పూర్వ వైభవం చాటుదామని పిలుపునిస్తున్నారు. అయితే అందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికల సాధ్యమేనా? అందుకు దేశవ్యాప్తంగా విపక్షాలు ఒప్పుకుంటాయా? అంతెందుకు బిజెపి మిత్రపక్షాలు సైతం ఈ నిర్ణయానికి జై కొడతాయా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లు పార్లమెంటులో ఆమోదముద్ర వేసుకునే పనిలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో.. జమిలి ఎన్నికల నిర్వహణపై కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.

* ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అదే మాట
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. జగన్ మాత్రం ముందస్తు ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ఓటమిని ఒప్పుకునే క్రమంలో.. దేవుడు దయ ఉంటే జమిలీతో ముందుగా ఎన్నికలు వస్తాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పరంగా సన్నాహాలు ప్రారంభించారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ సైతం స్పష్టమైన అంచనా తో ఉంటుంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ అధికార పక్షం కంటే జగన్ చేస్తున్న హడావిడి ఎక్కువగా ఉంది. 2027 ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారు జగన్. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

* అప్పట్లో చంద్రబాబు కూడా ఇలానే
అయితే ఈ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్నారు జగన్.వైసిపి హయాంలో కూడా చంద్రబాబుఇటువంటి ప్రకటనలే చేసేవారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులకు అలర్ట్ చేసేవారు. అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ పార్టీ శ్రేణులను మేల్కొనేవారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. మనం సైతం సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చేవారు. అయితే అప్పట్లో అదే నిజమని నమ్మి పార్టీ శ్రేణులు సైతం గట్టిగానే పోరాటం చేయడం ప్రారంభించాయి. తొలి మూడు సంవత్సరాలు బయటకు వచ్చేందుకు కూడా టిడిపి శ్రేణులు భయపడేవి. అటువంటిది ముందస్తు ఎన్నికల సాకుగా చూపి చంద్రబాబు చేసిన ప్రకటనలు పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు కూడా జగన్ అదే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా భారీ ఓటమితో నిరాశలో కూరుకుపోయిన.. పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.