Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒక్కో కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు సజ్జల. ఆయన డైరెక్షన్లోనే దాడి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దీంతో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం సజ్జల మంగళగిరి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. అయితే విచారణకు హాజరైన సజ్జలకు 38 ప్రశ్నలు అడిగారు విచారణ అధికారులు. కానీ సజ్జల మాత్రం తనకు తెలియదంటూ సమాధానం చెప్పారు. టిడిపి కార్యాలయం పై జరిగిన దాడిలో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలతోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో.. పట్టాభి కామెంట్స్ వింటే తన్నాలనిపించిందని సజ్జల వ్యాఖ్యానించడం విశేషం. అయితే అదే రోజు వైసిపి కీలక నేతలతో ఫోన్లో సంభాషించారని.. ఫోన్ ఇవ్వాలని కోరగా లేదని సమాధానం ఇచ్చారు సజ్జల. వైసీపీ నేతలతో మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తనపై ఫోకస్ పెట్టిందని.. వైసీపీ నేతలను కేసులతో ఇబ్బంది పెడుతోందని సజ్జల ఆరోపించారు. అయితే ఈ కేసు విషయంలో సజ్జల వెంట వచ్చిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొద్దిసేపు హల్చల్ చేయడం విశేషం.
* అప్పట్లో బహుముఖ పాత్ర
వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి బహుముఖ పాత్ర పోషించారు. సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు. అంటే ప్రతి పని వెనుక ఆయన హస్తం ఉందన్నమాట. జగన్ సర్కార్ చేసిన అరాచకాల వెనుక సజ్జల పాత్ర ఉంది. వైసిపి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా మారారు అన్న విమర్శ ఉంది. సకల శాఖ మంత్రిగా అన్ని శాఖలపై పెత్తనం చెలాయించారు. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అటువంటి సజ్జలు ఇప్పుడు తనకు తెలియదు, తన ప్రమేయం లేదు అని చెప్పుకు రావడం విశేషం.
* ఆయన ప్రమేయం సుస్పష్టం
ప్రస్తుతం వైసీపీ నేతలపై నడుస్తున్న కేసులన్నింటిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉంది. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఆయన ఉన్నారు. పార్టీ విధానాలు చెప్పినప్పుడు ఆయన ఉన్నారు. పార్టీలో చేర్పులు మార్పులు చేసినప్పుడు ఆయన ఉన్నారు. అంతెందుకు జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించి నప్పుడు విభేదాలు బయటపడ్డాయి. చాలామంది నేతలు సజ్జలనే నిందించారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు కూడా సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని తిరుగుతున్న వైసీపీ నేతలు కూడా తమ పరిస్థితికి సజ్జల కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు సజ్జలను పోలీసులు విచారణకు పిలిచినా వైసిపి నేతలు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆయన తీరుతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్న వారు ఎక్కువ మంది ఉన్నారు.