Ramoji Rao Vs YS Jagan : మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థలో అవకతవకలపై ఏపీ సర్కారు పట్టుబిగుస్తోంది. రామోజీరావును టార్గెట్ చేస్తూ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అష్టదిగ్బంధనం చేస్తున్నారు. మార్గదర్శి చైర్మన్ అయిన రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తన సర్కారుపై ఈనాడులో వ్యతిరేక కథనాలు రాస్తున్నందునే జగన్ అక్కసు తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్లో మీడియా దీనిపై ఎక్కువ ఘోషిస్తోంది. తెలుగుదేశం నాయకత్వం సైతం గొంతు చించుకొని మాట్లాడుతోంది. అయితే ఇక్కడ రామోజీరావు ఎర మాత్రమే. అసలు విషయం వేరే ఉంది.
రాజకీయాల్లో జగన్ బాగా ఆరితేరిపోయారు. 2014 ఎన్నికల్లో దెబ్బతినేసరికి బాగానే వంట పట్టించుకున్నారు. ప్రజలను వర్గ వైషమ్యాలుగా విడగొట్టడమే కాకుండా భయపెడితే కానీ పని జరగదని డిసైడ్ కు వచ్చారు. అందుకే ఇలిసి పరిగెలను ఎరగా వేశారు. తిమింగళాలను తన దారిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు రామోజీరావు విషయంలో చేస్తోంది అదే. వాస్తవానికి రామోజీరావును జైల్లో పెట్టి ముప్పుతిప్పలు పెట్టాలన్నది జగన్ వ్యూహం కాదు. రామోజీలాంటి శక్తివంతమైన వ్యక్తి, వ్యవస్థనే ఇబ్బందిపెడుతుంటే మనం ఒక లెక్క అన్న భావన ఇతరుల్లో తేవాలన్నదే జగన్ అసలు సిసలైన రాజకీయం.
ఒక్క రామోజీరావు విషయంలోనే కాదు. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల విషయంలో కూడా జగన్ ది ఇదే స్ట్రాటజీ. నిండు శాసనసభలో చంద్రబాబుకు జరిగిన అవమానం అందరికీ తెలిసిందే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంట్లో దూరి మరీ అరెస్ట్ చేశారు. రోజంతా రాష్ట్రమంతా తిప్పి చుక్కలు చూపించారు. వారికి ఇబ్బందులు పెట్టడం అటుంచి.. మిగతా వారికి భయం కల్పించాలన్నదే వ్యూహం. ఇప్పుడు రామోజీరావు విషయంలో అమలుచేస్తున్న పద్ధతి చూస్తుంటే జగన్ వ్యూహం ఏమిటన్నది ఇట్టే అవగతమవుతుంది.
రామోజీరావు మీడియా మొఘల్. మహా శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పచ్చళ్ల వ్యాపారం నుంచి ముద్రణ రంగంలో అడుగుపెట్టి రాజగురువుగా మారిపోయారు. తన కనుసన్నల్లో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించగల స్థాయికి చేరుకున్నారు. ఆయన్ను టచ్ చేయడం ఎన్టీ రామారావులాంటి నాయకుడికే వీలుపడలేద. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం మూడు అడుగులు ముందుకేసి.. రెండడుగులు వెనక్కి వేశారు. అందుకే రామోజీలాంటి వ్యవస్థను ముప్పుతిప్పలు పెడితే ఆటోమేటిక్ గా అతనిలాంటి వ్యవస్థలను తన కంట్రోల్ లోకి వస్తాయన్నది జగన్ భావన. అంతకు మంచి ఏమీ లేదని విశ్లేషకులు చెబుతుండడం విశేషం.