Vijaysai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిందా? ముఖ్యంగా ఢిల్లీలో ఆయన సేవలను తగ్గించారా? మరో నేతకు ఢిల్లీ బాధ్యతలు అప్పగించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో.. జాతీయస్థాయిలో పార్టీ బాధ్యతలను మాత్రం విజయసాయిరెడ్డి చూసేవారు. విజయసాయిరెడ్డికి తెలియకుండా వైసీపీ నేతలు ఢిల్లీలో అడుగులు వేసే వారు కూడా కాదు. ఎవరిని కలవాలన్నా, ఏం మాట్లాడాలన్నా విజయసాయి రెడ్డి అనుమతి తీసుకోవాల్సిందే. అంతలా నడిచేది ఆయన హవా. గత ఐదేళ్లపాటు వైసీపీకి బిజెపి సహకారం అందించడం వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసిపికి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ, పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడి సరుకులు అందించడంలోనూ సాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోదీ స్వయంగా గుర్తుపట్టి పిలిచి మాట్లాడే అంత చనువు ఉన్న నాయకుడు కావడం విశేషం. వైసీపీ తరఫున ఇప్పటివరకు ఢిల్లీలో చక్రం తిప్పుతూ వచ్చారు విజయసాయి. ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బిజెపితో వైసిపి సఖ్యతకు విజయసాయిరెడ్డి కారణం. 2018లో టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెప్పిన వైనం వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. గత ఐదేళ్లపాటు ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చూసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు కనిపించకుండా మానేశారు. ఆయన స్థానంలో మరో నాయకుడు భర్తీ కావడం విశేషం.
* సాయి రెడ్డి పై అనుమానాలు
విజయసాయి రెడ్డి వ్యవహార శైలి పై జగన్ కు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆయనను అలానే విడిచి పెడితే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి తనకు ఎదురు తిరుగుతారన్న అనుమానాలు జగన్ లో ఉన్నాయి. మొన్న ఆ మధ్యన విజయసాయిరెడ్డి పార్టీ మారతారని కూడా ప్రచారం సాగింది. అందుకే విజయసాయిరెడ్డికి మరోసారి ఉత్తరాంధ్ర రీజినల్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. అయితే దీని వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీకి హేమాహేమీలు ఉన్నారు. ప్రధానంగా బొత్స సత్యనారాయణ ఉండడంతో అక్కడ విజయసాయిరెడ్డి పప్పులు ఉడకవు. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఢిల్లీ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశారు జగన్. ఇప్పుడు ఆయన స్థానంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి వచ్చారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పని కావాలన్నా జగన్ గురుమూర్తికే చెబుతుండడం విశేషం.
* ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు ఆయనే
ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చెబుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాయి రెడ్డి తో సమానంగా గురుమూర్తి సేవలందించారు. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ గురుమూర్తి ముందుంటున్నారు. ఆయన జగన్ కు వీర విధేయుడు. అత్యంత నమ్మకస్తుడు కూడా. మొత్తంగా చూస్తే విజయసాయి రెడ్డికి దీటైన నాయకుడిని తయారు చేసే పనిలో పడ్డారు జగన్. తప్పకుండా మున్ముందు గురుమూర్తి పార్టీలో మరింత యాక్టివ్ కావడం ఖాయమని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.